Friday 7 December 2012

కర్మానుష్టాన ఆవశ్యకత

కర్మానుష్టాన ఆవశ్యకత
మనస్సును రజస్తమో గుణములు ఆవరించి, విషయములందు ఆసక్తిని కలుగ జేయును. ఆ ఆశక్తియే "కామ" మనబడును. ఈ గాలమునకు చిక్కిన జీవి ఆకారణముగా జంతువులేట్లు వ్యధ శాల యందు హింసింప బడునో అట్లే నానా విధ చిత్ర హింస లకు గురి అగుచున్నాడు  అని శ్రీ సురేశ్వరాచార్యులు చెప్పు చున్నారు.
 
ఈ సంసార సాగరము వలే అపరిచ్చినమై దుఖః ప్రదమై మహా భయంకరమై బ్రహ్మ మొదలు చీమ వరకు గల అనేకానేక జీవుల చే కూడి యున్నది.
అవిద్యా సంపర్కము చేత జీవుడు ఒకప్పుడు మనుష్య జన్మ మొదలు దేవతా జన్మల వరకును, మరియోకప్పుడు మనుష్య జన్మ మొదలు చీమ వరకును గల జన్మల ఎత్తుతూ పైకి క్రిందకు తిరుగుచు ఆ యా జన్మల యందు ఒక నియమ ప్రకారము సంభవించు సుఖమును, దుఖమును అనుభవించు చుండును.
 
మరి ఈ జన్మలకు కారణమేమిటి?  అదే కామము, కోరిక. కోరిక వుంటే జన్మ వస్తుంది. దేని మీద బలముగా కోరిక వుంటే దానిని అనుభవించుటకు మరొక జన్మ ఎత్తవలసి వస్తుంది. కోరికలు లేక పోతే జన్మలు వుండవు. మరి ఈ కామము పోవాలంటే ఏమి చేయాలి?  ఈ కామమునకు మూలమైన అవిద్యను నశింప చేసుకొనవలెను.  దాని కార్య రూపమగు కామ్య ప్రదములగు కర్మల నొనరించిన కర్మ దాని ఫలము, దానిని అనుభవించుట కొరకై జన్మ, జన్మించినందున మరణము లభించును.
 
ఈ క్రమముగా జీవి చక్రములో తిరుగుతూనే ఉండును. దీనికి అంతము ఉండదు. ఒక్క మహా ప్రళయములో తప్పించి.
దీనిని బట్టి జన్మ రాహిత్యము కావాలంటే, పొందాలంటే కర్మ రాహిత్యము గావించ వలెను. కామ రాహిత్యము గావించ వలెను.
 
దీనినే శ్రీ వ్యాసులు మహా భరతమున ఇలా అన్నారు.
 
కామ బంధనమే వేదం నాన్యదస్తీహ బంధనం
కామ బంధన ముక్తో  హి నేహ భూయోzభిజాయతే
 
కామమే సంసారమునకు కారణము అయ్యినది, అది నశించిన వెంటనే మోక్ష ప్రాప్తి కలుగును అని భావము.
 
కనుక కామము పోవలెనన దానికి మూల స్వరూప మగు అవిద్యను పోగొట్టుకోవలెను. అవిద్య తో గూడిన కర్మలు ఆచరించిన యెడల మోక్షము ఎలా వస్తుంది ? మరి అవిద్యను పోగొట్టు కోవలేనన ఏమి చేయాలి?
 
వేదాంత విచారణ చేయాలి. దానినే ముఖ్య సాధనముగా చేసుకోవలెను. మరి ఈ కర్మానుష్టానము దేనికి అంటే సంసారాభివృద్దికి, మరో ఉత్తమ జన్మకు.
 
దీనినే శంకర భగవత్పాదులు ఏమన్నారంటే
 
సంసార వర్ధకం కర్మ తన్ని వృత్యైన  కల్పతే,
ఆపి కొట్య జ కల్పానాం కర్మణా ముక్తి రిష్యతే
కోటి బ్రహ్మ కల్పములు కర్మాచారణము గావించిననూ, సంసారాభివృద్ధి మాత్రమె జరుగును గానీ ముక్తి ఎప్పటికీ లభించదు అని భావము.
 
మరి పూజ, జపము, తపము అనే కర్మాచరణములు దండగేనా వాటి వలన లాభము లేదా ?
 
ఎందుకు లేదు పై వాటి వలన నీకు ఉత్తమోత్తమైన జన్మ వచ్చును, ఆ జన్మలో నీ బుద్ధి ప్రచోదనము అయి, ఇది కాదు, ఇది కాదు అని అంటూ  వేదాంత విచారణ వైపు నీ పయనము గావిస్తువు. జ్ఞానము అంకురించును. అప్పటి దాకా నీ కర్మాచరణ ధర్మ బద్దముగా ఉండవలెను.
 

మీ

భాస్కరానందనాధ

మహావిద్యోపాసకులు, మహాపాదుకాంత శ్రీవిద్యాపూర్ణ దీక్షాపరులు.

శ్రీకాళహస్తి., చిత్తూరు (ఆ.ప్ర);

http://srilalithaparabhattarika.blogspot.in/

http://vanadurga-mahavidya.blogspot.in/

 

 
 
 

No comments:

Post a Comment

Note: only a member of this blog may post a comment.