Friday, 14 December 2012

నాశికా త్రయంబకం

నాశికా త్రయంబకం
 
శ్రీ రమణమహర్షిని భగవాన్ శ్రీ రమణ మహర్షిగా లోకానికి పరిచయము చేసిన మహా వ్యక్తీ , శ్రీ విద్యోపాసకుడు కావ్యకంఠ శ్రీ వాశిష్ట గణపతి ముని. సాక్షాత్తు వీరు గణపతి అంశలో పుట్టిన వారు. వీరి తండ్రి గారు నరశింహ శాస్త్రి గొప్ప మంత్ర, తంత్ర, జ్యోతిష, విశారదులు. శ్రీ విద్యా దీక్షను పొంది బ్రహ్మ నిష్టయై గ్రామాధికారిగా పనిచేయు చున్న వారు.
తన భార్య ఏడవ మాసమున గర్బముతో ఉండెను. సత్ సంతానము కొరకై వీరు కాలినడకన కాశీ వెళ్లి డుంఠి గణపతి ఆలయములో దీక్ష బూని కార్తీక మాసము నుండి జపము జేయసాగెను. పగళ్ళు ఉపవాస నియమము పాఠిస్తూ రాత్రుళ్ళు పాలను మాత్రమె ఆహారముగా సేవిస్తూ గడుపు చుండెను. ఇలా శ్రద్ధతో చేయుచున్న శాస్త్రి గారికి కార్తీక బహుళ అష్టమి నాడు
దైవ ప్రసాద సూచకమగు ఒక దర్శనము గలిగెను.
ఒక బాల శిశువు గణపతి విగ్రహము నుండి వెడలి తన కడకు ప్రాకుతూ వచ్చి తన తోడ పైకి ఎక్కి అంతర్ధాన మయ్యెను. కళ్ళు తెరిచి చూచిన శాస్త్రికి ఎవ్వరూ అక్కడ గన్పించ లేదు. ఆ తరువాత ఇంటికి వచ్చిన తరువాత తనకు కొడుకు కలిగిన వార్త విని సంతోషించి జాతక చక్రము వ్రాయ దలచి పుట్టిన తేదీని అడుగగా
ఏనాడు తనకు గణపతి దర్శనమిచ్చినాడో అదే తిది కార్తీక బహుళ అష్టమి, అదే సమయమునకు ఇక్కడ నరసమాంబ గణపతి మునిని ప్రసవించినది.
వీరి అసలు పేరు సూర్య గణపతి శాస్త్రి. వీరి గోత్రము కౌండిన్యస గోత్రము . కౌండిన్యస వంశములోని పిదప వాడైన వాసిష్ట పేరు మీదుగా " వాసిష్ట గణపతి శాస్త్రి " అని పిలువ సాగిరి. వీరికి ఆధ్యాత్మిక గురువు భగవాన్ శ్రీ రమణ మహర్షి. వీరు వారిని " నాయినా" అని పేరిడి పిలువ సాగిరి.
వీరు తండ్రి లాగే జ్యోతిష, మంత్ర, తంత్ర, శాస్త్రములలో దిట్ట. తండ్రి లాగే గొప్ప శ్రీ విద్యోపాసకులు. మహా గొప్ప సంస్కృత పండితుడు. ఆర్నెల్లు ఉద్యోగము, మరి ఆర్నెల్లు సద్యోగము అంటే ఉపాసన. అలాగే ఆర్నెల్లు సంసారము, ఆర్నెల్లు తప్పస్సు. ఇలా కొనసాగినది వారి జీవనము.
ఇలా తన తపో యాత్ర లో బాగంగా ఒక సారి బొంబాయి కి సమీపము లోని నాసిక్ పుణ్య క్షేత్రమునకు వెళ్ళెను.
నాసిక్ అంటే ముక్కు అని అర్ధము. సీతారామ లక్ష్మణులు అరణ్యమున పంచవటి చేరి యుండగా లక్ష్మణుని చే కోయబడిన శూర్పణఖ యొక్క నాసిక ఈ స్థలము నందు పడిన కారణముచేత దీనికి నాసిక అని పేరు గల్గెను. అది ఇప్పుడు "నాశిక్" అని పిలువ బడు చున్నది. దీనిపై లక్ష్మణుని ఆగ్రహము ఇప్పటికీ కలుగుచుచూ అప్పుడప్పుడు ద్వంసమునకు కారణమగు చుండుచున్నది అని పెద్దలు చెప్పుదురు.
అందుకు నిదర్శనముగా ఈ సంఘటన కూడా జరిగినది.
ఇచ్చట వూరి వెలుపల ఒక లక్ష్మణ ఆలయము వున్నది. తన తప్పస్సు కొరకు ఒకనాడు ఈ లక్ష్మణాలయము నాకు వెళ్ళెను. అతడు ద్వారము దాటగానే అక్కడి పూజారి యొకడు వెనుక నుండి హఠాత్తుగా గణపతి పై బడి గలియ బడి, జుట్టు పట్టుకొని నిర్దయతో హింసించి నాలుగు పిడి గుద్దులు గ్రుద్దేను. అంతటితో వూరుకోనక కీడ్చుకొంటూ గ్రామాధికారి దగ్గరకు లాక్కొని వెళ్ళెను. ఆ దేవాలయములో అంతకు మునుపే ఎవరో వచ్చి పూజా సామాగ్రిని దొంగిలించి ఉన్నందు వలన ఆ పూజారి గణపతే ఆ దొంగ అని తలచి, అనుమానించి ఇతనిని చావా బాది గ్రామాధికారికి అప్పజేప్పెను. గ్రామాధికారి తగిన విచారణ చేసి ఆ దొంగ ఇతను కాదని, ఇతను మహా విద్వాంసుడు అని తెలిసి ఆ పూజారిని చీవాట్లు పెట్టి పంపెను.
దీనికి పూర్వమే వాశిష్టునికి దేహ వేదనతో బాటు జరిగిన పరాభవము సహింప లేక అంతర్వేదనకు గురియై, పూజారి మూర్ఖత్వమును సహింపజాలక, క్రోధాగ్ని రూపమున భగ్గుమని వాశిష్టుని కంఠము నుండి శాప వాక్కు వదల బడెను.
ఈ నాశిక్ పట్టణము మిక్కిలి ద్వంసము అగు గాక ... అని శాపము ఇచ్చెను. ఒక్క పూజారి చేసిన పాపము మొత్తము ఆ ఊరినే నాశనము చేసినది. సత్పురుషలను, శ్రివిద్యోపాసకులను హింసించినా, కష్ట పెట్టినా, వారిని వ్యగ్రతకు గురి చేసినా అది మొత్తము కులమునకు, పట్టణమునకు నష్టము జెకూర్చును.
వారి శాపము అమోఘమై ప్రక్క రోజే పూజారి ఇంట మారీ అను విష జ్వరము ఆరంభమై, వాయు వేగముతో పురమంతయు వ్యాపించి పూజారి, అతని వంశము వారు, ఆ వూరి ప్రజలు సగం మంది చనిపోయిరి. ఆ తరువాత పెద్ద తుఫాను వచ్చి పెద్ద పెద్ద చెట్లు, గోపురములు కూలి, నగర మంతయూ స్మశాన మయ్యెను.
ఈ విధముగా ఒక శ్రీవిద్యోపాసకుని ఆగ్రహమునకు గురియై నాసిక్ పట్టణము సర్వ నాశనము అయినది.
కావున శ్రీ విద్యోపాసకులతో పరాచికములు ఆడ కూడదని, వారి వాక్కులో సకల వాగ్దేవతలు, మంత్రినీ దేవతలు ఉంటారని భావించి మనము జాగ్రత్తగా మసలుకోవలెను. కోటి జన్మల పూర్వ పుణ్యము వుంటే గాని ఈ శ్రీ విద్య రాదు.
అటువంటి పుణ్య పురుషులను మనము తగు విధముగా గౌరవించవలెను. వారి పట్ల అపరాధము తెల్సి జేసినా, తెలియక జేసినా తప్పు తప్పే. శిక్ష పడక తప్పదు. వారిని ఎవ్వరూ తప్పించ లేరు. ఆ పరమ శివుడైనా గురువు ఆగ్రహమును తప్పించ లేరు, ఇది నిజము అని మనకు ఎన్నో పురాణ ఇతిహాసములు చెప్పు చున్నవి. ఎన్నో తార్కాణములు కూడా గలవు. అయినా మన నైజము మారదు.
శుభం
మీ
భాస్కరానందనాథ