Friday, 29 June 2012

చండీ తత్త్వము (CHANDEE TATWAM)


చండీ తత్త్వము  (CHANDEE TATWAM)
ఆది తత్త్వమును స్త్రీ మూర్తిగా భావించి చేయు ఉపాసన శ్రీవిద్యోపాసన అని అందురు  . ఇది లలితా పర్యాయము, చండీ పర్యాయము అని రెండు విధములు.
రెండింటికీ శబ్దతః భేదమే కానీ వస్తుతః భేదము లేదు. మొదటిది పంచదశాక్షర మూల మంత్రము తో కూడినది   . రెండవది నవాక్ష ర మంత్రముతో కూడినది.  ఆ పరమాత్మ స్వరూపాన్ని స్త్రీ మూర్తిగా పూజించుటలో ఒక విశేష సౌలభ్యము కలదు. లోకములో తండ్రి దగ్గర కంటే తల్లి దగ్గర పిల్లలకు చనువు ఎక్కువ. తల్లి పిల్లల తప్పులు ఎంచక వాళ్ళను కడుపులో పెట్టుకొని లాలిస్తుంది. అన్ని విధముల వాళ్ళను బుజ్జగించుచూ మంచి అభివృద్దిలోకి తెస్తుంది. తండ్రి కోపపడినా తల్లి అంత తొందరగా కోపపడదు. ఎంతో ప్రేమానురాగాలతో బిడ్డను దగ్గరకు తీసుకొని పాలిస్తుంది. బిడ్డ యొక్క మంచి చెడులను తండ్రి కన్నా తల్లికే ఎక్కువగా తెలియును. అందువలనే వేదము కూడా “మాతృ దేవోభవ” అనుచూ తల్లిని పూజించమని తండ్రి కంటే తల్లికే అగ్ర పీట వేసినది. తల్లి యందలి ఈ నిర్వ్యాజ ప్రేమానురాగాల వలన పూజలలో గూడా భగవంతుడిని అమ్మ వారుగా పూజించుటలోని విశేషము.
కాళిదాసు తన రఘువంశము లో “వాగార్దా వివ” అని స్మరించినాడు. ఆది శంకరులు “మాతా చ పార్వతీ” అని స్తుతించినారు. వశిన్యాది వాగ్దేవతలు “ శ్రీ మాతా” అని అమ్మను పిలిచినారు.

“దుర్మార్గుడైన బిడ్డ వుంటాడు గాని, దుర్మార్గురాలైన తల్లి వుండదు”... అని ఆది శంకరుల వారు అన్నారు.
జగన్మాత పూజ ఇతర దేవతల కంటే త్వరితముగా ఫలితము నిచ్చి, బిడ్డను రక్షించును. జగన్మాత ఉపాసనము మాతృ సేవ వంటిది. తల్లి బిడ్డలను పెంచి పోషించినట్లు, ఆ జగన్మాత తన్ను ఉపాసించు భక్తులను తన బిడ్డలుగా ప్రేమించి భుక్తి ముక్తులను తప్పక ఇవ్వగలదు.  ఆమెను సేవించడము అత్యంత సులభము. తప్పులున్ననూ తల్లి సవరించును.
శ్రీ చక్ర సంచారిణి యైన జగన్మాత జగత్తునంతయు పోషించుచూ చరాచర సృష్టికి మూల కారణమై అంతటా వ్యాపించి సర్వ ప్రాణులలో శక్తి స్వరూపం లో చిచ్ఛక్తి అయి, చైతన్యమై, పర బ్రహ్మ స్వరూపమై ప్రకాశిస్తూ వున్నది.
సకల ప్రాణులకూ ఆమె తల్లి అయి “శ్రీమాత” గా పిలువబడు చున్నది.  అందుకే ఆమెను “ముగురమ్మల మూలపుటమ్మ, చాలా పెద్దమ్మ” అని పోతనామాత్యుడు అన్నారు.
వేదములు “విద్య” అని ఏ దేవిని చెప్పుతూ వుంటాయో, ఆ దేవిని ఆశ్రయించిన వారి ఆర్తిని పోగొట్టే దయామయి ఆ దేవి. తన్ను నమ్మిన వారిని ఆదుకునే అమ్మ. మునులు ఆ తల్లి పాదములను ధ్యానించి జ్ఞానులవుతారు.
పరమేశ్వరుని యందే అంతర్లీనమై, రక్త వర్ణ ప్రభలచే వెలుగొందుచూ, జీవన్ముక్తికి, ఐహిక ఫల సాధనకు ప్రత్యక్ష సాక్షియై, శ్రీచక్రము నందలి బిందు స్థానమై నెల కొని యున్న ఆ తల్లి శ్రీ లలిత యై, మహా త్రిపుర సుందరిగా, పిలువబడుచున్నది.
౧. జప చండీ  ౨. హోమ చండీ  ౩. తర్పణ చండీ అని త్రి విధములుగా చండీ ఉపాసన కలదు.
గుణ త్రయములకు ప్రతీక అయిన మహాకాళీ, మహాలక్ష్మీ, మహాసరస్వతీ రూప కలయక  చండీ.
జగన్మాత సాత్విక రూపం లలిత అయితే, తామస రూపం చండీ.

చండీ పరాభట్టారికా అంటే మహాకాళీ, మహాలక్ష్మీ, మహాసరస్వతీ స్వరూపిని, చండీహోమము అనగా దుర్గా సప్తశతి అనే 700 శ్లోకమలచే హోమము చేయడము. ఇందు 700 శ్లోకమలు 3 చరిత్రలుగా విభజించి ఉన్నాయి.
. ప్రధమ చరిత్ర మహాకాళీస్వరూపముగా, మధ్యమ చరిత్ర మహాలక్ష్మీ స్వరూపముగా,  ఉత్తమ చరిత్ర మహా సరస్వతీ స్వరూపముగా చెప్పబడి ఉన్నది.
చండీసమదైవం నాస్తి అన్ని పురాణాలు చెపుతున్నాయి. కలియుగములో సమస్త బాధలు, అతివృష్టి. అనావృష్టి, శత్రునివారణ చేయటానికి కుటుంబమును సర్వసౌభాగ్యములతో వృధి చేయడానికి మహాకాళి. మహాలక్ష్మీ, మహాసరస్వతి అయిన చండీపరాదేవత అనుగ్రహము చాలా అవసరము. అమ్మవారి ప్రీతిపాత్రమైన పౌర్ణమి తిధియందు త్రిదేవిసహీత, త్రిశక్తి అయిన చండిపరాదేవతను ఆరాధించి చండిహోమము ఎవరైతే జరిపించుకుంటారో ఆ కుటుంబమంతా పుత్ర పౌత్రాదులతో సుఖముగా జీవిస్తారని శ్రీ దేవి భాగవతమందు చెప్పబడినది.
 
ప్రణవములో అ కారము బ్రహ్మ, ఉ కారము విష్ణువు, మకారము శివుడు. బ్రహ్మ, విష్ణువు, మహేశ్వరులు ఒకరి కన్నా ఒకరు గొప్ప వారు. యోగమాయా బలానికి ఈ ముగ్గురూ కట్టుబడి వుండేవారే. త్రుటిలో జగత్తును సృష్టించి, పెంచి, సంహరించే దివ్యాతి దివ్య శక్తులు గల యోగామాయకు అందరూ తలలు ఒగ్గ వలసినవారే.
మాయ అంతర్ముఖ, బహిర్ముఖ భేదముతో రెండు విధములుగా వుంటుంది. ఈ మాయ వలెనే త్రిగుణములు, త్రిశక్తులు  ఏర్పడినవి.  బ్రహ్మాదులు ఈ గుణ త్రయానికి సంబంధించి వుంటారు. అగ్ని మండడం, గాలి వీచడం, సూర్యుడు ఉదయంచడం, విష్ణువు పోషించడం ఇవన్నీ ఆమె వలెనే జరుగుతూ వుంటాయి. ఆమె శక్తి గనుక లేకపోతే, వాళ్ళకు గుణాలు వుండవు. పేర్లు మాత్రమే మిగులుతాయి. దేవతలు అందరూ ఆ యోగ మాయ చేతిలో కీలు బొమ్మలు. ఆమె ఆడించినట్లు ఆడుతూ వుంటారు.  చంద్రునకు వెన్నలగా, అగ్నికి వేడిమిగా, సూర్యునకు వెలుగుగా వున్నది ఆమే శక్తియే. ఆత్మను ఆశ్రయించిన మాయకే విద్య అని పేరు. అది ఒక ఆవరణ. దానిని తొలిగిస్తే నిత్యమూ సత్యమూ అయిన ఆ తల్లి రూపం కనిపిస్తుంది.

 సృష్టి స్థితి లయములు గావించున్న ఆ మహా మాయను ఎవరు ఉపాసించు చున్నారో, వారు జనన మరణ రూపమగు సంసారము నుండి తరించు చున్నారని, మోక్షమును బొందుచున్నారని నృసింహతాపిన్యుపనిషత్తు
తెలియ జెప్పుచున్నది. ఆ శక్తిని భజించినవాడు మృత్యువును జయించి మోక్షమును బొందును.
త్వం వైష్ణవీ  శక్తి రనంత వీర్యా విశ్వస్య బీజం పరమాzపి మాయా సమ్మోహితం దేవి సమస్త మే తత్...
ఈ లోక మంతయూ మాయా శక్తి చే సమ్మోహిత మగుచున్నది.
ఒకప్పుడు దేవిని దేవత లెల్లరు “అమ్మా నీ వెవరు? అని అడుగగా
“నేను బ్రహ్మ స్వరూపిణిని, నా వల్లనే ప్రకృతి పురుషులు పుట్టుచున్నారు, జగమును జనించు చున్నది” ... అని చెప్పినది.
 సర్వే వై దేవా దేవీ ముపతస్థుః కాసిత్వం దేవీ సా zబ్రవీ దహం  బ్రహ్మ రూపిణీ మత్తః ప్రకృతి పురుషాత్మకం జగత్.
అట్లే మాయ, బ్రహ్మ రూపిణి, విశ్వ మోహిని, ఆత్మ స్వరూపిణి అని భువనేశ్వరి ఉపనిషత్తు చెప్పుచున్నది.
  “ స్వాత్మ్యైవ  లలితా .... అని భావనోపనిషత్తు చెప్పు చున్నది
చితి స్తత్పదలక్ష్యార్దా చిదేకరస రూపిణి ... అని బ్రహ్మాండ పురాణము అమ్మను కొని యాడినది.
ఇట్లు అష్టాదశ పురాణములు, ఉప పురాణములు,  స్మృతులు దేవిని పర బ్రహ్మమని ప్రతి పాదించినవి.

శక్త్యక్ష రాణి  శేషాణి హ్రీం కార ఉభాయాత్మకః .. అని 
ఇతర బీజాక్షరములు కేవలము  శక్తికి సంబంధించినవి వనియు, మాయా బీజమైన హ్రీం కారము మాత్రము ఉభాయాత్మక మైన శివ శక్త్యాత్మక బీజమని బ్రహ్మాండ పురాణము చెప్పు చున్నది.
హ్రీం బీజము పర బ్రహ్మ స్వరూపమని, మోక్షప్రదమని దేవీ భాగవతము చెప్పు చున్నది.
హ్రీం హ్రీమితి ప్రతి దినం జపతాం జనానాం,
కిం నామ దుర్లభమిహ త్రిపురాధివాసే.
త్రిపురముల యందు వసించు ఓ .. అమ్మా హ్రీం హ్రీం అని నీ బీజ మంత్రమును జపించు వారికీలోకమున దుర్లభమైన దేమియునూ లేదు. సకల కల్యాణ భాజనమైనదీ హ్రీంకారము. శ్రీదేవీ ప్రణవము  హ్రీంకారము.
(సూచన:- ఉపదేశము లేనిదే మంత్రములను ఉపాసన చేయకూడదు.)
ఓం శ్రీ గురుః  పరమ కారణ భూతాశక్తిః  ... అని భావనోపనిషత్తు చెప్పు చున్నది.
శ్రీవిద్యా పూర్ణ దీక్ష నొసగిన శ్రీ గురువులు  శ్రీ పరాదేవి స్వరూపులే. శ్రీ గురుదేవుల అనుగ్రహము చేత మహా వాక్య ప్రాప్తి, ( శ్రీవిద్యా పూర్ణ దీక్ష యందు మహా వాక్యములతో గూడిన మహా పాదుకలను ఇచ్చెదరు.) 
దాని వలన బ్రహ్మాత్మైక్య సిద్ది లభించు చున్నందున శ్రీ గురువులే పరమ కారణమైన పరా శక్తి స్వరూపులని,       శ్రీ గురువులకు శ్రీ మాతకు అభేదము అని శ్రీవిద్యా సర్వస్వం చెప్పు చున్నది.
అట్టి శ్రీ గురుదేవులకు నమస్కరిస్తూ ,

మీ
భాస్కరానందనాధ (దీక్షా నామము)
కామరాజుగడ్డ రామచంద్రరావు

కలి స్థానములు - వాని సంతతి


దుస్సహుడు - వాని సంతతి
సృష్టిచేయు కాలమునందు బ్రహ్మమనస్సున గల్గిన విసుగు కారణముగా దుస్సహుడను రాక్షసుడు
పుట్టెను. అతనికి ఆకలి  యెక్కువ. కనబడిన జంతువుల నన్నింటిని
మ్రింగుచుండెను. అది చూచి బ్రహ్మ "ఓరీ! నీ విట్లు అన్నింటిని మ్రింగరాదు.
నీవు తినుటకు పదార్ధములు, ఉండదగిన చోట్లు చెప్పెదను వినుమని యిట్లు
చెప్పెను. "నీవు సత్కర్మానుష్టానములకు ఆటంకము కలిగింపుము. దుర్జనుల
యిండ్లలో నుండుము. సాలె పురుగులు, కుక్క, పిల్లి, ముట్టిన పదార్ధములను,
కుండలలో నిలువయున్న అన్నములను, ఊదిన పదార్ధములను. దేవునికి నివేదన చేయక
వున్నా పదార్ధములను నీవు తినుచుండుము. దీపపు క్రీనీడలోను, ఉదయము సాయంకాలము
సంధ్యా సమయములలోను ఎవరు భోజనము చెయుదురో వారి పుణ్యము నీకు చెందెను. శ్రద్ద
లేకుండ చేయు హొమములును, స్నాన సంధ్యాదులకు ముందే అపవిత్రముగా చేయు దాన
ధర్మాదులును, జలధార లేకుండ ఇచ్చిన దానమును ఇచ్చిన వారికి పుణ్యము నీయవు. ఆ
పుణ్యము నీకు చెందును. ఇంటి ముందు కళ్ళాపి చల్లి ముగ్గులు
పెట్టనియిండ్లలోను, పుట్టలు పెట్టిన యిండ్లలోను, రాత్రి దీపము పెట్టని
యిండ్లలోను నీవు నివసించుచుండుము.       

నియమనిష్టా పరులై ఆచార వ్యవహారములు నడుపుచు సత్కర్మలు ఆచరించు సజ్జనుల ఇండ్ల జోలికి పోకుము". ఆ దుస్సహుడు అట్లేయని బ్రహ్మ చెప్పినట్లు నడచు కొనుచుండెను. 
 కలిపురుషుని  భార్య ఒక చండాలునితో సంపర్కము పెట్టుకొని నిర్మాష్టి అను కుమార్తెను
గనెను. దానిని ఈ దుస్సహుడు పెండ్లి యాడెను. దానియందు వీనికి ఎనమండుగురు
కుమార్తెలును జనించిరి. వారందరును ప్రజలను బాధించువారే.
వారి పేర్లు, వారు చేయు పనులును ఇట్లుండును.
కొడుకులు:
1. దంతాకృష్టి :
పిల్లలు పండ్లు కొరుకుటకు కారణము వీడే.ఆవాలు చల్లి, సువర్చస్సులను మూలిక
కలిపిన నీటితో పిల్లలకు స్నానము చేయించుటచే వీని పీడ తొలగును.  

2. వ్యక్తి : ఇంటిలోని
వారు శుభవాక్యములుగాని అశుభ వాక్యములుగాని ఉచ్చరించినచో 'తధాస్తు'
అనుచుండును. అశుభ వాక్యములు పలికినప్పుడు శ్రీ కృష్ణనామ స్మరణ చేయవలెను.  

3. పరివర్తకుడు : గర్భ స్రావములకు వీడే కారణమగును. గర్భస్థ పిండములను పీడించును. గర్భమును రక్షించు వేద మంత్రములను పటించినచో వీనిపీడ తొలగును.

4. అంగయుక్తుడు : గాలిరూపములో
శరీరములందుండి, కన్నులు భుజములు మొదలగు అంగములను అదురునట్లు చెయును.
దర్భలతో అదిరిన అంగములను తుడిచినచో వీని పీడ తొలగును.   

5. శకుని: కాకి, గ్రుడ్లగూబ, మొదలగు పక్షులందు చేరి శుభాశుభములను తెలుపుచుండును. (శకున పక్షి అను లోకోక్తి వినవలననే వచ్చియుండును.)

6. గండ ప్రాంతరికుడు : గండాంతము
అను ముహూర్త మునందుండి వీడు ప్రమాదములు కలిగించును. ఆవాలు కలిపిన
గోపంచితముతో స్నానముచేసి దేవతల, బ్రాహ్మణుల వల్ల దీవెనలు పొందినచో వీని పీడ
పోవును.
7. గర్భఘ్నుడు : పువ్వుల
ద్వారా గర్భిణీ స్త్రీల గర్భములతో జేరి పిండములను నాశనము చేయును. అందుకే
గర్భిణీ స్త్రీలు పూవులు పెట్టుకొనరాదు. భగవన్నామ స్మరణయే దీనికి శాంతి.

8. సన్యఘ్నుడు : పంటలు పండు పొలములలో జేరి పంటలను, కూర గాయాలను చీడల ద్వారా పాడు చేయును. దిష్టి బొమ్మలను పొలములలో కట్టినచో వీని పీడ ఉండదు.

ఇంక కుమార్తెలు:
1. నియోజిక : పురుషులకు, ఇతరుల ధనముల మీదను, స్త్రీలమీదకు వ్యామోహము పుట్టించును. వేద పారాయణము, పూరణ పఠనము చేయువారి కీమె వల్ల పీడ ఉండదు.

2. విరోధిని : ఆలుమగల మధ్య పోట్లాటలు, వైమన స్యములు కలిగించును. దాన ధర్మములతో ఈమె పీడ పోవును.

3. స్వయంభార : పాడి
పశువులు, స్త్రీలు, ధాన్యములు, మున్నగువాని వద్ద చేరి నాశనము చేయుచుండును.
నెమలి యీకలు గాని, దేవుని పటములు గాని అక్కడ ఉంచుటవలన దీని పీడ పోవును.

4. భ్రామరి : మగవారికి, కారణము లేకుండగనే స్త్రీల పై కామవికారములు పుట్టించును. భూసూక్తము పారాయణ చేసి, ఆవాలు చల్లినచో దీని పీడ తొలగును.      

5. ఋతుహారిక : రజస్సు స్త్రీలకు సంతాన కారణము. అట్టి రజస్సును ఇది క్షీణింపజేయును. నదీస్నానములు, ఔషధ సేవనము చేసిన దీని పీడ పోవును.

6. స్మృతిహారిణి :
మనుష్యులలోని జ్ఞాపక శక్తిని అపహరించును. అగ్ని హొత్రము చేయుట, అది
చేయలేనివారు లలితాసహస్రనామ పారాయణ చేయుట ద్వారా దీని పీడ నుండి విముక్తి
పొంద వచ్చును.
7. బీజహారిణి :
స్త్రీ పురుషుల యందుండు శుక్ర శోణితములలో గల సంతాన బీజములను నాశనము
చేయును. విత్తనములలో జేరి వానియందు మొలకెత్తు శక్తిని పోగొట్టును.
వ్రతములు, అన్నదానములు మొదలగు దాన ధర్మముల వలన ఈ పీడ పరిహారమగును.

8.విద్వేషిణి : ఇది దంపతుల మధ్యచేరి ప్రతిదినము కలహములు పుట్టించుటకు ప్రయత్నించును. దేవతారాధనములు, బ్రాహ్మణ భోజనములు జరిపించినచో ఇది శాంతించును.

ఈ పదునారుగుకిని సంతానము ఉన్నది.వారందరును ప్రజలకును అందులోను అనాచార వంతులకును, ధర్మము నాచరింపని వారికి కీడు చేయుచుందురు.

 మీ
భాస్కరానందనాధ





నిత్యపవిత్ర వస్తువులు



నిత్యపవిత్ర వస్తువులు

సాలగ్రామములు,
బంగారము, నెయ్యి, నూతన వస్త్రములు, పుస్తకములు, మణులు నిత్య పవిత్రత గల
వస్తువులు. నెయ్యివేసి అభి ఘారముచేసిన అన్నము పవిత్ర మగును. గోధుమధాన్యము,
యవలు, గో క్షీరములు పంచగవ్యము పవిత్రములైనవి. పువ్వులు, పప్పులు, ధాన్యములు
గృహొప కరణములైన పాత్రలు మున్నగునవి నీళ్ళు జల్లినచో శుద్దయగును.
పట్టుబట్టలు నార చీరలు, వేడి నీళ్ళు చల్లినచో శుద్ద యగును. వేదాధ్యయనము
చేసిన బ్రాహ్మణుడును అగ్నియు నిత్య పవిత్రులు. వ్రతదీక్షలో నున్న వాడును,
సన్న్యాసియు నిత్య పవిత్రులు.   








1.     అరిష్టములు
 తన నీడయు కనబడనివాడు సంవత్సరములోపల మరణించును;
సూర్యునియందును, అగ్నియందును కిరణములున్నట్లు కనిపించనిచో పదునొక్కండు
నెలలు బ్రతుకును. కలలో తాను మలమూత్రములు విడిచినట్లుగాని వాంతి
చేసికొన్నట్లు గాని కనిపించిన పది నెలలు బ్రతుకును. కలలో శవమును గాని
పిశాచములను గాని చూచినచో తొమ్మిది నెలలు జీవించును. కారణములేక
లావైనట్లుగాని కలలో కనిపించినను, బుద్ది మాంద్యము కలిగినను సప్త మాసములలో
పల మరణించును. అరుంధతీ నక్షత్రమును చూడలేక పోయినను గ్రద్ద, కాకి,  గ్రుడ్లు
గూబయు తలమీద తన్నినను ఆరునెలలో మరణించును. తన దేహమునీడలో శిరస్సు కనబడనిచో మూడునెలలో మరణించును.   

తన శరీరము కంపుకొట్టినను, స్నానము చేసిన వెంటనే శరీరమున తడి కనబడ కుండినను,
ఎలుగు, గాడిద, కోతి, దున్నపోతు వీనిపై నెక్కి దక్షిణాభి ముఖముగా పోవుచున్నట్లు కలవచ్చినను, తల విరయబోసి కొన్న స్త్రీ యేడ్చుచు కలలో కనబడినను, చెవులు మూసి కొన్నప్పుడు ప్రాణఘోషము (గుంయ్యిమను శబ్దము) వినబడక  పోయినను, ముక్కువాసనను, నాలుక రుచిని గ్రహించలేక పోయినను త్వరలో మరణము కలుగునని తెలిసికొని బుద్దిమంతుడైన వాడు భగవంతునియందె ధ్యానము నుంచి జ్ఞానియై సౌఖ్యమును పొందుటకు ప్రయత్నించవలెను.        

సూర్యోపాసన వలన పలితములు:-
సూర్యుడు జగత్తులకే కన్నువంటివాడు. అయన బ్రహ్మ విష్ణు మహేశ్వర స్వరూపుడు. ఉదయకాలమందు బ్రహ్మ స్వరూపుడు. మధ్యాహ్నకాలమందు రుద్ర స్వరూపుడు. సాయంకాలమున విష్ణు స్వరూపుడ నియు చెప్పబడును. వేదములందును ఈయన మహిమలు ఇట్లు వర్ణింపబడినవి. సూర్యుడు వేదమయుడు. పాత్రఃకాలమున ఋగ్వేదమునందు వెలుగొందు చుండును. మధ్యాహ్నమున యజుర్వేదమున ప్రకాశించును. సాయంకాలమునందు సామ వెదమున దీపించును. త్రికాలము లందును ఏ క్షణము గూడ వేదములు అనుసరించకుండ సూర్యుడు సంచరించడు.
సూర్యునారాధించు వారికి హృద్రోగములు (గుండెజబ్బులు) ఉండవు. హరిమ (పచ్చ కామెర్లు) అను వ్యాధి రాదు. నేత్ర రోగములుండవు. (పూర్వము మయూరుడను మహాకవి, అంధుడై తనకు దృష్టి కలుగుటకు సూర్యుని ఆరాధించి ఆయన పై నూరు శ్లోకములు చెప్పి, ఆయన అనుగ్రహము చేత దృష్టిని సంపాదించెను. ఉదర సంబంధము లైన రోగములుగాని, మహావాత, మేహరోగములుగాని సూర్యు నారాధించెడి వారికి రావు. ఒక వేళ అట్టి రోగములున్నవారు సూర్యారాధనము చేసినచో ఆరోగములు  శాంతించి దేహారోగ్యము కలుగును. ఋగ్వేద మందలి మహాసౌరము, యజుర్వేద మందలి అరుణము ఈ రెండింటితో పాటు త్రిచ విధానముగా సూర్య నమస్కారములు చేసినచో లేదా చేయించుకొన్నచో సమస్త వ్యాధులును నశించి ఆరోగ్య వంతులగుదురు.