Friday, 8 June 2012

శ్రీవిద్య - శ్రీ చక్రము-1


శ్రీవిద్య
శ్రీవిద్యలో మొట్టమొదట బాల మంత్రమును ఉపదేశిస్తారు. బాల తరువాత నవాక్షరి (చండీ మంత్రము), దాని తరువాత పంచదశాక్షరీ, తరువాత షోడశి, దాని తారువాత మహా షోడశి,  (పూర్ణ దీక్ష )   దాని తారువాత మహాపాదుకలు.  దాని తారువాత మహా విద్య . వీటితో శ్రీవిద్య  పూర్తి అవుతుంది. లలితా తత్త్వం పంచదశాక్షరీ,     కామకామేశ్వరీ తత్త్వం మహాషోడశి.

పాదుకాంత పూర్ణ దీక్షాధికారము కలవారే వనదుర్గా మహావిద్యా పంచశతీ  పారాయణము చేయుటకు అర్హులగుదురు.  శ్రీవిద్యలో, దీక్షా నామము వున్నదంటే వారు పూర్ణ దీక్షాధికారము కలవారు అని అర్థము. శ్రీవిద్య మంత్రము, యంత్రము, తంత్రము మరియు ముద్రలతో ముడిపడి వుంటుంది. మంత్రానుష్టానము చేత తద్దేవత ఉపాసకునికి వశమౌతుంది. ధర్మ పరాయణులకు మంత్రములు పుష్పములై  రక్షిస్తాయ్, అధర్మ పరులకు పాములై కాటు వేస్తాయి. చాలా కఠినమైన విద్య ఈ శ్రీవిద్య.
శ్రీవిద్యలో, మహావిద్యలో ఆరి తెరినవారు, వృద్దులు, ఉద్దండులు, మహోపాసకులు ఎందరోమహానుభావులు వున్నారు మన గడ్డ ఫైన. ఇప్పటికి అజ్ఞాతంగా ఎందరో ఉపాసకులు వున్నారు. కొందరు బయట పడతారు, కొందరు పడరు, వారందరికి నమస్కరిస్తూ మహావిద్య గురించి నాకు తెలిసిన నాలుగు మాటలు మీతో పంచుకొంటున్నాను.
వనదుర్గా మహావిద్యా పంచశతీ
ధ్యాన శ్లోకము :-
హేమప్రఖ్యా మిందుఖండాత్త మౌళీ౦,
శంఖారీష్టా2భీతిహస్తాం త్రినేత్రాం,
హేమాబ్జస్థా౦ పీతవస్త్రాం ప్రసన్నాం,
దేవీం దుర్గాం దివ్యరూపాం నమామి.

ప్రకృతి మాతగా, మహామాయ అయిన ఆ పరదేవత వన దుర్గేశ్వరీ రూపంలో విరాజిల్లింది. ఈ మహావిద్య పూర్వాన్గోత్తరాంగ సహిత శ్రీ వనదుర్గా మహావిద్యా పంచశతీ, మంత్రరాజముగా ప్రసిద్దికెక్కి విరాజిల్లుచున్నది.
 500  మహా మంత్రములతో ఈ మంత్ర రాజము, ఉపాసకులకు కొంగుబంగారమై ప్రకాశిస్తూ వున్నది.

వేదము జ్ఞాన కాండను, కర్మ కాండను ప్రతి పాదించినది. ఈ రెంటికీ మధ్య నున్నది ఉపాసన కాండ.
దైవము మంత్రమునకు వశుడగును. ఆ మంత్రము గురువు ఆధీనములో నుండును.. కావున సద్గతిని పొందగోరు సాధకులు సద్గురువును ఆశ్రయించి, మంత్ర దీక్షితుడై , సాధన చేత దేవతను, ఆత్మను, అను సంధాన మొనర్చుకొని, మోక్ష మార్గము వైపు అడుగులు వేయాలి.
ఒకరినొకరు పరీక్షించుకొనక మంత్ర దీక్ష ఇచ్చినను, లేక పొందిననూ ఆ మంత్రములు నిష్ఫలములు అగుటయే కాక, వారు పతన హేతువులగుదురు. చిత్తచాంచల్యము కలుగును.
 అని పెద్దలు, గురువులు చెప్పినారు. ఇది శాస్త్ర వచనము. నా మాటలు కావు. సంప్రదాయమును రక్షించు గురువు దేవతలకు సైతము ప్రశంసాపాత్రుడు.

శ్రీవిద్యలో 30 సంవత్సరముల సాధనతో, అనుభవంతో, సాధికారతతోగ్రంధ పరిశీలనతో నేను పలుకుతున్నాను.  శ్రీవిద్యను ఔపోసన చేసి మాట్లాడుతున్నాను.ఒట్టి మాటలు కావు, భయ పెట్టటానికి కాదు. తెలియక దెబ్బ తింటారే పిల్లలు అని ప్రేమతో,తపనతో చెబుతున్నాను.
మిడిమిడి జ్ఞానంతో పలుకకండి, శాస్త్ర వచనము తెలుసుకొని, శాస్త్ర పరిశీలన చేసి, గురువుల అనుమతి తీసుకొని శ్రీవిద్యను అనుసరించ వలెను. తెలియక పోతే పెద్దలను నలుగురును ఆశ్రయించండి. విధి విధానాలను ఆచరించండి. మీకై మీరు అన్వయించుకోకండి. ప్రతి దానికి శాస్త్రము నిర్ఖర్షగా చెప్పినది.
లెక్క చేయక పుస్తకములను చూచి అనుష్టానము చేస్తే తల బొప్పి కడుతుంది తస్మాత్ జాగ్రత్.

ఉపాసనా కాండయందు గల విద్యలలో సర్వ రక్షాకర విద్య అయిన మహావిద్య పరమో త్క్రుష్ట మైనది.
మహావిద్య పారాయణమునకు పాదుకాంత దీక్షితులకు మాత్రమే అధికారము కలదు.
మహావిద్య పారాయణము సర్వ సౌఖ్య ప్రదాయిని.  ధర్మ, అర్థ , కామా మోక్ష ఫల ప్రదమని, సంతతిని, సౌభాగ్యములను ఇచ్చునని , సర్వ పాపములను హరించునని, మాయను తొలగించి జ్ఞాన మోసగే బ్రహ్మ విద్య అని, మోక్ష విద్య అని శ్రీ రేణుకా తంత్రమునందు వివరింపబడినది.

500  మహా మంత్రములతో ఈ మంత్ర రాజము మాలా మంత్రమై, మహావిద్యగా నొప్పారుచున్నది.
ఇందలి మంత్రములు :-
౧. సర్వ శత్రు వినాశకర మంత్రములు.
౨. సర్వ దేవతా దిగ్బంధః మంత్రములు.
౩. సర్వ అస్త్ర  దిగ్బంధః మంత్రములు
౪. త్రిమూర్తి , త్రిలోక దిగ్బంధః మంత్రములు
౫. ఇంద్రాది అష్ట దిక్పాలక దేవతా దిగ్బంధః మంత్రములు.
౬. నవగ్రహాది మంత్రములు.
౭. సర్ప సూక్త మంత్రములు.
౮. సర్వ రాక్షస దిగ్బంధః మంత్రములు.
౧౦. రుద్ర, శక్తి దిగ్బంధః మంత్రములు.
౧౧. సర్వ రక్షాకర మంత్రములు.
౧౨. దూర దృష్టి , దూర శ్రవణ, స్తంభన మంత్రములు.
౧౩. అష్టాదశ పీఠ మంత్రములు.
౧౪, శివ, రామ,కృష్ణ , వాసుదేవ, హయగ్రీవ, నృసింహ, సుదర్శన, శ్రీమన్నారాయణ, గరుడ, సర్ప, దక్షిణామూర్తి దత్తాత్రేయ, కుబేర, లక్ష్మీ, దుర్గ, చండీ, చాముండీ, బగలా, వైష్ణవి, సరస్వతి, గాయత్రీ, వనదుర్గ దేవతా  మంత్రములు.
౧౫. యక్షిణి, కుబేర, సూర్య, ఆదిత్య, భాస్కర, హనుమద్గణేశాది మంత్రములు.
౧౬. మంత్ర గాయత్రీ, భద్రకాళి, మహాకాళి, మహా ప్రత్యింగిరా మంత్రములు.
౧౭. శాంతి మంత్రములు, మృత్యుంజయ మంత్రములు.
౧౮. సర్వ రక్షా కర  మంత్రములు.
౧౯. రోగ, భయ, దుర్గతి, దుర్దశ నాశ మంత్రములు.
౨౦.  ప్రతి కూల వినాశక , అనుకూల మంత్రములు.
౨౧. అభీష్ట ఫలదాయక , జ్వర హర, శూల హర, సర్వ గ్రహ నివారక, శత్రు వినాశకర మంత్రములు.
౧౨. యక్ష, గంధర్వ, కిన్నెర, కింపురుషాది మంత్రములు.
౧౩. శివ, విష్ణు ,దేవీ మంత్రములు.
౧౪. అఘోర మంత్రములు.
౧౫. బాల, నవాక్షరి, పంచదశాక్షరి, షోడశి, మహా షోడశి, మహా మంత్రములు.
౧౬. మహా జ్వరహర, వశీకరణ మంత్రములు.
౧౭. దశ మహా విద్య మంత్రములు.

ఈ మహావిద్య రుద్రయామళ తంత్రార్గత మైన, కల్ప కౌస్తుభము నందు రహస్యముగా చెప్ప బడినది.
ఈ మహా విద్యను ఉపశించే సాధకులను మహోపాసకులు  అని అందురు. నిష్కామంగా, ధర్మబద్ధముగా చేయుటచే ఉపాసకున్ని రక్షిస్తూ, మోక్ష మార్గము వైపు  నడిపించేది ఈ మహావిద్య.
వేద మంత్రములతో కూడినదైన ఈ మంత్ర రాజమును పారాయణ చేయుటకు సంప్రదాయ పూర్ణ దీక్షా పరులు మాత్రమే అర్హులు.

అట్టి ఈ మహావిద్యను పారాయణ చేయుటకు గత పది సంసంవత్సరములుగా అర్హత కలిగించి, అనుగ్రహించిన ఆ పరదేవతకు అంజలి ఘటిస్తూ,
అనేన మయా కృతేన పూర్వాంగోత్తరాంగ సహిత శ్రీ మహావిద్యా పంచశతీ మంత్ర రాజ మాలామంత్ర పారాయణేన,  శ్రీ మహావిద్యా వనదుర్గేశ్వరీ స్వరూపిణీ శ్రీ మహా కామేశ్వర్యంబా, ప్రతాప భారతీ ప్రియతాం, ఇతి జలధారా పూర్వకం శ్రీ పరదేవతా కరారవిందే పారాయణం సమర్ప్య...  
ఓం శాంతిః ఓం శాంతిః ఓం శాంతిః ఓం శాంతిః
Note- (పిచ్చి వేషాలు వేసేవారికి ఈ విద్య చాలా ప్రమాదము)


న గురోరధికం, న గురోరధికం, న గురోరధికం, న గురోరధికం
శివ శాసనతః  శివ శాసనతః  శివ శాసనతః  శివ శాసనతః 

మీ
భాస్కరానంద నాథ
మహావిద్యోపాసకులు, మహాపాదుకాంత శ్రీవిద్యాపూర్ణ దీక్షాపరులు
 (కామరాజుగడ్డ రామచంద్రరావు)

No comments:

Post a Comment

Note: only a member of this blog may post a comment.