సభకు నమస్కారములు. భూసురులకు ప్రణామములు.సభ్యులు తెలిపిన అభిప్రాయములు విని, వారి ఆంతరంగికము తెలుసుకొని మహదానందం పొందినాను. మీ అందరితో నేను కూడా ఏకీభవిస్తున్నాను.
రోజు రోజు కు బ్రాహ్మణత్వం మంట గలసి పోతున్నది. దానిని కాపాడుకోవలసిన బాధ్యత మన మందరి మీద వున్నది.కనీసములో కనీసము మన ఈ గ్రూపులో వున్న సభ్యులు అందరము తప్పక ఆచార వ్యవహారములు కాపాడుతామని ఒక ప్రమాణము చేసుకోవాలి. తదనుగుణంగా మన దిన చర్య వుండాలి. మన అందరికీ పెద్ద దిక్కుగా, దిశా నిర్దేశము చేయడానికి మన పూజ్య గురువులు, పుణ్య పురుషులు, కారణ జన్మలు బ్రహ్మశ్రీ చాగంటి వారు ఆచార్య రూపములో మన మధ్యలో నడ యాడుతూ వున్నారు. వారు చెప్పినట్లుగా, వారి అడుగు జాడలలో నడవడానికి మన మందరమూ సంసిద్ధులము కావాలి. ముందు మన కుటుంబములో మార్పు తీసుకొని వస్తాము, ఆ తరువాత మన బంధువులలో, స్నేహితులలో మార్పుఆశిస్తాం, తద్వారా మన చుట్టుపక్కల వారిని, సమాజాన్ని మార్చ వచ్చును. ఒక్క సారి ఎవ్వరూ మారరు. చెప్పగా చెప్పగా అందరూ మారుతారు.
నాకు తెలిసి మన అందరిలో బద్ధకము వున్నది, ఈ బద్ధకము వలన చాలా వరకు మన వాళ్ళు మారలేక పోతున్నారు. బద్ధకము వదులుకొంటే మన మందరము నిజమైన బ్రాహ్మణుల మౌతాము, అప్పటి దాక పేరుకు మాత్రమే బ్రాహ్మణులము. ఇది మారాలి. ఏదో సాకు చూపించుకొని మన విధులను విస్మరించి పతనావస్థకు జారి పోతున్నాము. సంకల్ప బలము తగ్గి పోతున్నది, దాని వలన అనుష్టానం తగ్గి, బ్రహ్మత్వం తగ్గి, దైవ శక్తి సన్నగిల్లుతున్నది. దీనివలన మంత్ర శక్తి తగ్గి, మంత్రములు పని చేయుట లేదు. అందరిలోనూ తమో గుణం ఎక్కువై పోతున్నది. సత్వ గుణం ఎక్కువైనప్పుడే బ్రాహ్మణుడు యోక్క వాక్కు బ్రహ్మ వాక్కు అవుతుంది. కర్మానుష్ఠానము తగ్గి, తపోశక్తి తగ్గు చున్నది. మన మందరము సప్త ఋషుల యొక్క వారసులము. మన తాత ముత్తాతలు ఎంతో గొప్ప తపః శక్తి సంపన్నులు, కానీ మనం చాలా బలహీనులమై పోయినాము. ఎందువలన ? నిత్య కర్మానుష్ఠానము వదిలి వేయడము వలన, గాయత్రీ ని మరచి పోవడము వలన ఆచార వ్యవహారములను అట కెక్కించి, మైల, అంటును ఇంట్లో కలుపుకొని, జప ధ్యానాధులను గాలికి వదలి, యజ్ఞోపవీతమును కోస్టాండ్ కు తగిలించి, నీచ సాంగత్యము చేసి, మధువు, ముక్క, మగువ అని అంటూ మకార పంచకముతో సహవాసము చేసి శక్తి హీనులమై భ్రష్టులమై పోతున్నాము. దైవత్వం నిలబడాలంటే ఎలాగ? వాక్ శుద్ధి ఎక్కడ నుంచి వస్తుంది, బ్రహ్మ తేజస్సు ఎలా వస్తుంది. రోజు రోజుకు దిగ జారి పోతున్నాము, క్రిందకి పడి పోతున్నాము. మరలా ఇంకో శంకరాచార్యులు రావాలి, మనము బాగు పడాలంటే. ఎంతో మంది బ్రాహ్మణులను నేను చూచాను 80% వరకు అందరికీ అన్నీ అలవాట్లు వున్నాయి, ఎందుకు ఇలా అయిపోతున్నదో అర్ధము కావటము లేదు.
ఇటువంటి కాలములో కూడా మహా పురుషులు వున్నారు.
ఉదాహరణకు మా గురువు గారు. వారు మడితో తప్ప భోజనము చేయరు, బయట హోటలుకు పోరు, బయట వండిన వస్తువులు తినరు, మంచి నీళ్ళు కూడా మినరల్ వాటర్ కూడా తాగారు, ఆఖరకి దేవుడి ప్రసాదము దేవాలయములలో ఇచ్చినది కూడా తినరు, కారణము వాళ్ళు మడి తో చేయరు అని. మొన్న నేను తిరుమల శ్రీ వెంకటేశ్వర ప్రసాదము లడ్డు తెచ్చి ఇస్తే, అది కూడా ముట్ట లేదు, కారణము వాళ్ళు మడి తో చేయరు అని. ప్రాణము పోయినా సరే మడితో చేయని పదార్ధమును ముట్టరు. ఒకసారి కాశీ కి గురువు గారితో వెళితే వారి భాధ చూసి నాకు మనస్సు ద్రవించినది. రైలు లో కూడా ఏదీ తినరు, కాఫీ, టీలు త్రాగరు, రెండు రోజులు రైలు లో ప్రయాణించినా ఏదీ తినరు, పండ్లు తప్ప. కాశీలో ఏ ఆశ్రమములో కూడా ఇలా మడి కట్టుకొని అన్నము వండే వాళ్ళు ఎక్కడ కనపడ లేదు. మడి అంటే ఆడవాళ్ళూ లోపల లంగా లేకుండా కాశాపోసి (లోపల చీర గోచి లాగా కట్టడము) కట్టి, మగ వాళ్ళు అయితే గోచి పోసి మడి గుడ్డతో అన్నము వండడము, ఇలా ఎవ్వరూ చేయడము లేదని మా గురువు గారు, అమ్మగారు అక్కడ వున్నన్ని నాళ్ళు, 12 రోజులు పూర్తిగా పండ్లతో, అటుకులతో పాపము కాలము వెల్ల బుచ్చినారు. వారికి 80 ఏండ్లు, ఇప్పటికీ అదే తరహాలో వుంటారు, పెండ్లిలలో కూడా భోజనము చేయరు, ఎవరన్నా విడిగా, మడిగా వండి పెడితే తింటారు లేక పోతే పస్తు వుంటారు. ఎవరన్నా శిష్యులు ఇళ్లకు పిలిస్తే, "మైల, అంటు ఇంట్లో కలుపుతారా? విడిగా వుంటారా ? మడిగా అన్నము వండుతారా..అని అడిగి అలా పద్ధతి గా చేసే వాళ్ళ ఇంటికే వారు వెళతారు, మడి కట్టుకొని భోజనము చేస్తారు. అంత పద్దతిగా వుండే మహానుభావులు ఇంకా మన మద్యలో ఎంతో మంది వున్నారు. వారిని చూసి మనము నేర్చుకోవాలి.
మడి అంటే ఏమిటి?
ముందు రోజు సాయంత్రము, కట్టుకోవలసిన బట్టలను తడిపి, పిండి, తడి బట్ట కట్టుకొని దండేముల మీద గానీ, లేక బయట ఆరు బయలులో గానీ ఎవరూ తాక కుండా ఆర వేయవలెను. ప్రక్క రోజు మరలా తడి గుడ్డ తో, ఆరిన మడి బట్టలను తెచ్చుకొని గోచీ పోసి కట్టు కోన వలెను. మడి కట్టుకొన్న తరువాత ఇక ఎలాంటి మైల వస్తువులను తాక కూడదు, తాకితే మరలా స్నానము చేసి మరలా వేరే మడి బట్ట కట్టుకొని వంట చేయ వలను. మడితో నే భగవంతునికి నైవేద్యము పెట్టి, ఆ మడి తోనే భోజనము చేయాలి. ఆ తరువాత మడి వదలి మైల తాకుతారు. మడి బట్ట లేనప్పుడు ధావళి కట్టుకోవచ్చు. లేదా పట్టు బట్ట కట్టుకోవడము మూడో పద్ధతి.
పట్టు బట్టతో గాని, ధావళి తో గాని భోజనము చేయకూడదు, ఒక వేళ చేస్తే మరలా తడిపి మడిగా ఆరవేసి కట్టుకోవలెను. పట్టు బట్ట (ఒరిజినల్) ను కట్టుకొని వంట వండి, నైవేద్యము అయిన తరువాత మరలా జాగ్రత్తగా ఎవ్వరూ తాక కుండా పెట్టుకొని, మరలా ప్రక్క రోజు వాడు కొనవచ్చు. అయితే అమావాస్య అమావాస్య కు తడిపి ఆరవేయవలెను, లేక పోతే పట్టుగుడ్డలు మడికి పనికి రావు. ధావళి తో చేస్తే చాలా శ్రేష్టము. ధావలితో వున్నప్పుడు పొరబాటున మైల వస్తువులను తాకినా దోషము వుండదు. ధావళి కట్టుకొని సంధ్య వార్చడము పట్టు బట్ట కంటే శ్రేష్టము. పట్టు బట్టలో కొంత దోషము వున్నది, అదే జీవ హింస, కావున కొంతమంది దానిని త్యజిస్తారు.
కావున శ్రేష్టము నూలు గుడ్డ లేక ధావళి. పంచను లుంగి లాగ కట్టుకొని మగ వాళ్ళు గానీ, చీరను లుంగి లాగ, లో పావడా తో ఆడ వాళ్ళు గాని కట్టుకొని దైవ కార్యములు చేయకూడదు. కారణము జననే౦ద్రియములు ఆచ్ఛాదనం లేకుండా వుండ కూడదు. ఇది శాస్త్రము. కావున మగ వాళ్ళు గానీ, ఆడవాళ్ళూ గానీ గోచీ పోసి పంచ, చీర కట్ట వలెను. మగ వాళ్ళు గోచీ పోసి ధోవతి కట్టి దైవ కార్యములలో పాల్గొన వలెను.
మడి తో పచ్చళ్ళు, మడితో వడియాలు, మడితో పాలు, పెరుగు, నెయ్యి వుంచడం ఇవన్నీ చాలా వరకు పోయినాయి. కొద్ది కొద్దిగా నైనా మరలా ఆచరణలోకి తీసుకొచ్చే ప్రయత్నము చేస్తాము అందరము. మనము ఆచరించి, అందరికీ చూపించి ఆదర్శకులము అవుతాము. మనల్ని మనము కాపాడుకొంటాము. ఒక్క సారి మడి కట్టి చూడండి దాని లోని ఆనందము, స్వచ్ఛత, పరిశుభ్రత, దైవతం అనుభవము లోకి వస్తాయి. కొన్నిటిని మనము అంత ఖచ్చితముగా పాటించలేము. కనీసము మనము ఇంట్లో వున్నప్పుడు అయినా ఇలా అందరము పాటిస్తాము. మా గురువు గారి లాగ వుండా లంటే చాలా కష్టము, కొంత మంది వున్నారు ఇంకా అలాగే. వాళ్ళకు చేతులు ఎత్తి నమస్కరిస్తూ, శుభం భూయాత్.
మీ
భాస్కరానంద నాధ
mee(manandhari) guruvu gariki padabi vandanamulu
ReplyDeleteintha goppa ga madi sampradayam gurinchi chepinanduku miku kuda vandhanamulu