Tuesday, 19 June 2012

మడి అంటే ఏమిటి?

మడి అంటే ఏమిటి?
ముందు రోజు సాయంత్రము, కట్టుకోవలసిన బట్టలను తడిపి, పిండి, తడి బట్ట కట్టుకొని దండేముల మీద గానీ, లేక బయట ఆరు బయలులో గానీ ఎవరూ తాక కుండా ఆర వేయవలెను. ప్రక్క రోజు మరలా తడి గుడ్డ తో, ఆరిన మడి బట్టలను తెచ్చుకొని గోచీ పోసి కట్టు కోన వలెను. మడి కట్టుకొన్న తరువాత ఇక ఎలాంటి మైల వస్తువులను తాక కూడదు, తాకితే మరలా స్నానము చేసి మరలా వేరే మడి బట్ట కట్టుకొని వంట చేయ వలను. మడితో నే భగవంతునికి నైవేద్యము పెట్టి, ఆ మడి తోనే భోజనము చేయాలి. ఆ తరువాత మడి వదలి మైల తాకుతారు. మడి బట్ట లేనప్పుడు ధావళి కట్టుకోవచ్చు. లేదా పట్టు బట్ట కట్టుకోవడము మూడో పద్ధతి.
పట్టు బట్టతో గాని, ధావళి తో గాని భోజనము చేయకూడదు, ఒక వేళ చేస్తే మరలా తడిపి మడిగా ఆరవేసి కట్టుకోవలెను.  పట్టు బట్ట (ఒరిజినల్) ను కట్టుకొని వంట వండి, నైవేద్యము అయిన తరువాత మరలా జాగ్రత్తగా ఎవ్వరూ తాక కుండా పెట్టుకొని, మరలా ప్రక్క రోజు వాడు కొనవచ్చు. అయితే అమావాస్య అమావాస్య కు తడిపి ఆరవేయవలెను, లేక పోతే పట్టుగుడ్డలు మడికి పనికి రావు. ధావళి తో చేస్తే చాలా శ్రేష్టము. ధావలితో వున్నప్పుడు పొరబాటున మైల వస్తువులను తాకినా దోషము వుండదు. ధావళి కట్టుకొని సంధ్య వార్చడము పట్టు బట్ట కంటే శ్రేష్టము. పట్టు బట్టలో కొంత దోషము వున్నది, అదే జీవ హింస, కావున కొంతమంది దానిని త్యజిస్తారు.
కావున శ్రేష్టము నూలు గుడ్డ లేక ధావళి. పంచను లుంగి లాగ కట్టుకొని మగ వాళ్ళు గానీ, చీరను లుంగి లాగ, లో పావడా తో ఆడ వాళ్ళు గాని కట్టుకొని దైవ కార్యములు చేయకూడదు. కారణము జననే౦ద్రియములు ఆచ్ఛాదనం లేకుండా వుండ కూడదు. ఇది శాస్త్రము. కావున మగ వాళ్ళు గానీ, ఆడవాళ్ళూ గానీ గోచీ పోసి పంచ, చీర కట్ట వలెను. మగ వాళ్ళు గోచీ పోసి ధోవతి కట్టి దైవ కార్యములలో పాల్గొన వలెను.
మడి తో పచ్చళ్ళు, మడితో వడియాలు, మడితో పాలు, పెరుగు, నెయ్యి వుంచడం ఇవన్నీ చాలా వరకు పోయినాయి. కొద్ది కొద్దిగా నైనా మరలా ఆచరణలోకి తీసుకొచ్చే ప్రయత్నము చేస్తాము అందరము. మనము ఆచరించి, అందరికీ చూపించి ఆదర్శకులము అవుతాము. మనల్ని మనము కాపాడుకొంటాము. ఒక్క సారి మడి కట్టి చూడండి దాని లోని ఆనందము, స్వచ్ఛత, పరిశుభ్రత, దైవతం అనుభవము లోకి వస్తాయి. కొన్నిటిని మనము అంత ఖచ్చితముగా పాటించలేము. కనీసము మనము ఇంట్లో వున్నప్పుడు అయినా ఇలా అందరము పాటిస్తాము. మా గురువు గారి లాగ వుండా లంటే చాలా కష్టము, కొంత మంది వున్నారు ఇంకా అలాగే. వాళ్ళకు చేతులు ఎత్తి నమస్కరిస్తూ,   శుభం భూయాత్.
మీ
భాస్కరానంద నాధ /19-06-2012

No comments:

Post a Comment

Note: only a member of this blog may post a comment.