దుస్సహుడు - వాని సంతతి
సృష్టిచేయు కాలమునందు బ్రహ్మమనస్సున గల్గిన విసుగు కారణముగా దుస్సహుడను రాక్షసుడు
పుట్టెను. అతనికి ఆకలి యెక్కువ. కనబడిన జంతువుల నన్నింటిని
మ్రింగుచుండెను. అది చూచి బ్రహ్మ "ఓరీ! నీ విట్లు అన్నింటిని మ్రింగరాదు.
నీవు తినుటకు పదార్ధములు, ఉండదగిన చోట్లు చెప్పెదను వినుమని యిట్లు
చెప్పెను. "నీవు సత్కర్మానుష్టానములకు ఆటంకము కలిగింపుము. దుర్జనుల
యిండ్లలో నుండుము. సాలె పురుగులు, కుక్క, పిల్లి, ముట్టిన పదార్ధములను,
కుండలలో నిలువయున్న అన్నములను, ఊదిన పదార్ధములను. దేవునికి నివేదన చేయక
వున్నా పదార్ధములను నీవు తినుచుండుము. దీపపు క్రీనీడలోను, ఉదయము సాయంకాలము
సంధ్యా సమయములలోను ఎవరు భోజనము చెయుదురో వారి పుణ్యము నీకు చెందెను. శ్రద్ద
లేకుండ చేయు హొమములును, స్నాన సంధ్యాదులకు ముందే అపవిత్రముగా చేయు దాన
ధర్మాదులును, జలధార లేకుండ ఇచ్చిన దానమును ఇచ్చిన వారికి పుణ్యము నీయవు. ఆ
పుణ్యము నీకు చెందును. ఇంటి ముందు కళ్ళాపి చల్లి ముగ్గులు
పెట్టనియిండ్లలోను, పుట్టలు పెట్టిన యిండ్లలోను, రాత్రి దీపము పెట్టని
యిండ్లలోను నీవు నివసించుచుండుము.
నియమనిష్టా పరులై ఆచార వ్యవహారములు నడుపుచు సత్కర్మలు ఆచరించు సజ్జనుల ఇండ్ల జోలికి పోకుము". ఆ దుస్సహుడు అట్లేయని బ్రహ్మ చెప్పినట్లు నడచు కొనుచుండెను.
కలిపురుషుని భార్య ఒక చండాలునితో సంపర్కము పెట్టుకొని నిర్మాష్టి అను కుమార్తెను
గనెను. దానిని ఈ దుస్సహుడు పెండ్లి యాడెను. దానియందు వీనికి ఎనమండుగురు
కుమార్తెలును జనించిరి. వారందరును ప్రజలను బాధించువారే.
వారి పేర్లు, వారు చేయు పనులును ఇట్లుండును.
కొడుకులు:
1. దంతాకృష్టి :
పిల్లలు పండ్లు కొరుకుటకు కారణము వీడే.ఆవాలు చల్లి, సువర్చస్సులను మూలిక
కలిపిన నీటితో పిల్లలకు స్నానము చేయించుటచే వీని పీడ తొలగును.
2. వ్యక్తి : ఇంటిలోని
వారు శుభవాక్యములుగాని అశుభ వాక్యములుగాని ఉచ్చరించినచో 'తధాస్తు'
అనుచుండును. అశుభ వాక్యములు పలికినప్పుడు శ్రీ కృష్ణనామ స్మరణ చేయవలెను.
3. పరివర్తకుడు : గర్భ స్రావములకు వీడే కారణమగును. గర్భస్థ పిండములను పీడించును. గర్భమును రక్షించు వేద మంత్రములను పటించినచో వీనిపీడ తొలగును.
4. అంగయుక్తుడు : గాలిరూపములో
శరీరములందుండి, కన్నులు భుజములు మొదలగు అంగములను అదురునట్లు చెయును.
దర్భలతో అదిరిన అంగములను తుడిచినచో వీని పీడ తొలగును.
5. శకుని: కాకి, గ్రుడ్లగూబ, మొదలగు పక్షులందు చేరి శుభాశుభములను తెలుపుచుండును. (శకున పక్షి అను లోకోక్తి వినవలననే వచ్చియుండును.)
6. గండ ప్రాంతరికుడు : గండాంతము
అను ముహూర్త మునందుండి వీడు ప్రమాదములు కలిగించును. ఆవాలు కలిపిన
గోపంచితముతో స్నానముచేసి దేవతల, బ్రాహ్మణుల వల్ల దీవెనలు పొందినచో వీని పీడ
పోవును.
7. గర్భఘ్నుడు : పువ్వుల
ద్వారా గర్భిణీ స్త్రీల గర్భములతో జేరి పిండములను నాశనము చేయును. అందుకే
గర్భిణీ స్త్రీలు పూవులు పెట్టుకొనరాదు. భగవన్నామ స్మరణయే దీనికి శాంతి.
8. సన్యఘ్నుడు : పంటలు పండు పొలములలో జేరి పంటలను, కూర గాయాలను చీడల ద్వారా పాడు చేయును. దిష్టి బొమ్మలను పొలములలో కట్టినచో వీని పీడ ఉండదు.
ఇంక కుమార్తెలు:
1. నియోజిక : పురుషులకు, ఇతరుల ధనముల మీదను, స్త్రీలమీదకు వ్యామోహము పుట్టించును. వేద పారాయణము, పూరణ పఠనము చేయువారి కీమె వల్ల పీడ ఉండదు.
2. విరోధిని : ఆలుమగల మధ్య పోట్లాటలు, వైమన స్యములు కలిగించును. దాన ధర్మములతో ఈమె పీడ పోవును.
3. స్వయంభార : పాడి
పశువులు, స్త్రీలు, ధాన్యములు, మున్నగువాని వద్ద చేరి నాశనము చేయుచుండును.
నెమలి యీకలు గాని, దేవుని పటములు గాని అక్కడ ఉంచుటవలన దీని పీడ పోవును.
4. భ్రామరి : మగవారికి, కారణము లేకుండగనే స్త్రీల పై కామవికారములు పుట్టించును. భూసూక్తము పారాయణ చేసి, ఆవాలు చల్లినచో దీని పీడ తొలగును.
5. ఋతుహారిక : రజస్సు స్త్రీలకు సంతాన కారణము. అట్టి రజస్సును ఇది క్షీణింపజేయును. నదీస్నానములు, ఔషధ సేవనము చేసిన దీని పీడ పోవును.
6. స్మృతిహారిణి :
మనుష్యులలోని జ్ఞాపక శక్తిని అపహరించును. అగ్ని హొత్రము చేయుట, అది
చేయలేనివారు లలితాసహస్రనామ పారాయణ చేయుట ద్వారా దీని పీడ నుండి విముక్తి
పొంద వచ్చును.
7. బీజహారిణి :
స్త్రీ పురుషుల యందుండు శుక్ర శోణితములలో గల సంతాన బీజములను నాశనము
చేయును. విత్తనములలో జేరి వానియందు మొలకెత్తు శక్తిని పోగొట్టును.
వ్రతములు, అన్నదానములు మొదలగు దాన ధర్మముల వలన ఈ పీడ పరిహారమగును.
8.విద్వేషిణి : ఇది దంపతుల మధ్యచేరి ప్రతిదినము కలహములు పుట్టించుటకు ప్రయత్నించును. దేవతారాధనములు, బ్రాహ్మణ భోజనములు జరిపించినచో ఇది శాంతించును.
ఈ పదునారుగుకిని సంతానము ఉన్నది.వారందరును ప్రజలకును అందులోను అనాచార వంతులకును, ధర్మము నాచరింపని వారికి కీడు చేయుచుందురు.
మీ
భాస్కరానందనాధ
No comments:
Post a Comment
Note: only a member of this blog may post a comment.