Sunday, 10 June 2012

వేదాంతం


 వేదాంతం

ఒక అడవిలో పోతున్న నలుగురికి, ఒక చెట్టు క్రింద నవకాయి పిండి వంటలతో వండిన పంచ భక్ష్య పరమాన్నములు కనిపించినవి  . మిగతా ముగ్గురూ ఆ వంటల యొక్క రుచులను ఆస్వాదిస్తూ, అవి ఏవిధముగా తయారు చేసినారో, ఎలా మసాలాలు కలిపినారో, ఎలా వండినారో, వస్తు గుణములను చర్చించుకొంటూ, ఇలా కాదంటే, అలా కాదంటే అని ఒకరికొకరు వాదించుకోవడం మొదలు పెట్టినారు.  .చివరకు తగువులాడు కొనేదాకా వచ్చినది పరిస్థి తి.  . నాలుగోవాడు మాత్రము ఇవేవీ పట్టనట్లు హయిగా ప్రశాంతంగా అన్ని రుచులను ఆస్వాదిస్తూ, అనుభవిస్తూ కడుపునిండా మొత్తం భుజించించినాడు. అలా నేను ఆ నాలుగో వాడ్ని, భుజించడం తప్ప ఏమీ తెలియని వాడ్ని.  ఎవరో మహానుభావులు చక్కగా వండి పెట్టినారు, వాటిల్ని ఎంత తొందరగా వీలైతే అంత తొందరగా తినడమే ద్యేయంగా పెట్టుకోన్నవాణ్ణి. నాకు మరలా ఆలోచించే సమయము లేదు అందుకు తగిన అర్హత, ఆవశ్యకత లేదు. కారణం ఎందరో జ్ఞానులు, యోగులు వివరించి, తర్కించి పండు వలిచినట్ట్లుగా, సిద్దాన్నము, మధురాన్నము వండి పెట్టినారు. వాటిల్ని తిని కడుపు నింపుకోవడమే నా పని. ఈ కాలములో ప్రతి ఒక్కరికీ ఆత్మ, పరమాత్మ జ్ఞానము వున్నది. అందరికీ తెలుసు "నేను శరీరము కాదు, ఆత్మను అని. 
వచ్చే ఇబ్బందల్ల     దానిని అనుభవములోకి తీసుకొని రావడమే. అనుభవములోకి వచ్చినది ఆచరణలోకి రావాలి.
నేను శరీరము కాదు, ఆత్మననునది అనుభవములోకి రావాలి. వస్తే మనందరమూ భగవాన్ రమణ మహర్షులము అయిపోతాము. నాకూ నాలుగు మహా వాక్యములను పూర్ణ దీక్షలో ఉపదేశించినారు, కానీ వాటిల్ని ఆచరణలోకి తీసుకొని రాలేక పోవుచుంటిని. జ్ఞానము లేదా  అంటే అంటే జ్ఞానము వున్నది. లేనిది ఒక్కటే అని ఈ మధ్యనే తెలుసుకొన్నాను. అది ఏమిటంటే వైరాగ్యము. అది ఇంకా కొరవడలేదు. విషయ వాంఛల మీద మమకారం పోవాలి. వాటిల్ని నుంచి విముక్తుడ్ని గాలేక పోతున్నాను. కాబట్టి భక్తి, జ్ఞాన, వైరాగ్యములు ఈ మూడునూ కావాలి, ఏది లోపించినా ఫలితము సున్న అని తెలుసుకొన్నాను. ఇప్పుడు అదే పని మీద వున్నాను. నాకు మాయ అని బాగా తెలుసు.  కానీ వదలి పెట్ట లేక పోతున్నాను.  తెలుసుకొనే లోపల మాయ వచ్చి కప్పేస్తున్నది. మాయకు లొంగి పోతున్నాను. తెలుసుకొనే లోపల అంతా జరగి పోతున్నది.
మాయ అని తెలిసి సంసారమును వదలి పెట్టిన వాడు రమణ మహర్షి భగవాన్ అయినాడు.
అలా ప్రకృతి మాయ లాంటిది, అది ఆ పరః బ్రహ్మం చేతిలోనే వున్నది. వదలడానికి ఆయన అనుగ్రహము కావాలి.
కనిపించేదల్లా మాయ, అది నశించేది. శాశ్వతంగా వుండేది ఆ పరమాత్మ.

ఈ సృష్టి అంతా మాయ. ఎవనికి విషయవాంఛలు మీద ఆసక్తి వుండునో అతనికి బ్రహ్మ దర్శనం లేదు.
వస్తువులననుభవింప వలననేడి ఇచ్చ చేత సంసార బంధ మేర్పడుచున్నది. భోగేచ్ఛ ఎప్పుడు నశించునో,
అప్పుడు సంసార బంధము తొలగి పోవుచున్నది. ముముక్షువునకు రాగద్వేషము లుండకూడదు.
కావున  రాగద్వేషములు గల వాని యందు శమదమాదులే గాక ముముక్షత్వము గూడ యుండజాలదు.

పర బ్రహ్మమునకు సాటియగు పదార్ధమే లేకపోవుట చేత ఉపమాన ప్రమాణమునకు తెలియబడదు.
పర బ్రహ్మమునకు గుణ క్రియాదులు లేనందున ఆయన శబ్ద,రూప, నామ ప్రమాణములకు గోచరింపడు.
పర బ్రహ్మమునకు శబ్ద స్పర్శ రూప రస గంధములు లేవు. శబ్ద స్పర్శ రూప రస గంధములు మాత్రమే గ్రహించు సామర్ధ్యము గల మన ఇంద్రియములు, శబ్ద స్పర్శాదులు లేని పర బ్రహ్మమును నెట్లు గ్రహించ గలవు?
అందుచేత పర బ్రహ్మము ఇంద్రియ గోచరము కాదు.
వేదమునకు మాత్రమే గోచరించును గాని, అన్య ప్రమాణమునకు గోచరము కాదని శ్రుతులు చెప్పుచున్నవి.

ఇక మిధ్య గురించి. అంతా భ్రాంతి, అంతా మాయ అని అంటూ వుంటాము. ఈ సృష్టి అంతా మాయ. అలా ప్రకృతి మాయ లాంటిది. మార్పు చెందుతూ వుంటుంది. ఒక్కోసారి నశిస్తూ వుంటుంది. మరి ఈ మాయను అర్ధం చేసుకోవడం ఎలాగ?
మొన్నో సారి నాకు ఓ కల వచ్చినది. ఆ కలలో నేను మహారాజులాగా సింహాసనం మీద కూర్చొని వున్నాను.
వేద పండితులు మంత్రోచ్ఛారణతో నా తలపై కిరీటమును వుంచినారు. వందిమాగధులు, సేవకులు ముందు నడవగా నేను ఏనుగు అంబారీ పైన కూర్చొని ఉరేగుతున్నాను. ఇదీ నా కల. తెల్లవారితే, ఆలోచిస్తే ఓహో కలనా అని అనుకున్నాను. ఇప్పుడు చెప్పండి. సింహాసనం అబద్దమా, లేక ఏనుగు అబద్దమా లేక వేద పండితులు అబద్దమా లేక నేను ఉరేగుట అబద్దమా ఏది అబద్దము? అన్నీ నిజమే. కారణం నేను అనుభవిన్చినాను.అనుభూతులున్నాయి. అందుకు నేనే సాక్ష్యం. మరి నిజమైతే ఉదయాన్న అవి లేవే. అవి లేవు కాబట్టి అది కల. భ్రాంతి. అంతా మిధ్య. దీనికి ఎన్నో ప్రమాణములు తర్కించి, శోధించి మహానుభావులు గురువులు ఆదిశంకరాచార్యులు, శంకరభగవత్పాదులు  మనకు ఎన్నో అందించి వున్నారు. సిద్దాంతములతో ప్రామాణీకరించివున్నారు. మరలా ఇది నిజమా, అది నిజమా అని నిర్ధారించడానికి మనమేవరము.
కొన్ని కోట్ల జన్మలు ఎత్తినా వారి కాలి గోటికి సమము గాని వారలము.  వారి సిద్దాంతములను, వారు చూపిన ప్రమాణములను వ్రేలెత్తి చూపడం ఎంతవరకు సబబు. పైగా గురు నింద చేసిన దోషము గలుగక మానదు.
వారు చెప్పిన ఆప్త వాక్యములను  శిరశావహించడం తప్ప. శంకరభగవత్పాదులు ఆ దేవదేవునికి మహా నివేదన చేసి మనకు ప్రసాదముగా  శాస్త్ర ప్రమాణములను, భాష్యములను అందించినారు. వాటిల్ని కళ్ళకద్దుకొని ఆరగించడమే మన కర్తవ్యము గదా.
౧. ప్రత్యక్ష జ్ఞానం రెండు విధములుగా వున్నది. అది ౧. ప్రమాజ్ఞానం ౨. భ్రమాజ్ఞానం అని. ఎన్ని సార్లు చూచినా ఎందరు చూచినా మార్పు చెందని జ్ఞానం ప్రమాజ్ఞానం అంటారు. ఉదాహరణకు సముద్రము. ఎవరు ఎన్ని మార్లు ఎప్పుడు చూచినా మారనది. అందుకని ఆ సముద్రాన్ని గూర్చి మనకు కలిగిన జ్ఞానం ప్రమాజ్ఞానం అంటారు.
అలాకాక మార్పు చెందేది భ్రమాజ్ఞానం. దూరంగా వున్న మనిషిని చూచి మన గురువు అని అనుకోవడము.
దగ్గరకు వెళ్ళిన తరువాత అయ్యో అచ్చం మన గురువులాగే వున్నారు. మన గురువని పొరబడ్డాము అని అనుకోవడము. దగ్గరకు వెళ్ళిన తరువాత నిజము తెలుసుకోవడము. దీనిని భ్రమాజ్ఞానం అని అంటారు.

ఇలాంటివే ౧. మరు మరీచి భ్రాంతి – ఎండ మావును నీళ్ళనుకోవటం.
౨. శుక్త రజత భ్రాంతి – ముత్యపు చిప్పను వెండి అనుకోవడము
౩. స్థాణు పురుష భ్రాంతి – మొద్దును చూచి మనిషి అనుకోవడము
౪. రజ్జు సర్ప భ్రాంతి – త్రాడును సర్పమనుకోవడము.

౨. అనుమాన ప్రమాణ జ్ఞానం – పొగను చూచి అగ్ని అనుకోవడము
౩. శబ్ద ప్రమాణ జ్ఞానం -  అంటే వేదం. అనేక యుగాల నుండి సర్వజ్ఞులైన మహా ఋషులచేత ఉచ్చరింపబడిన అనుభవరాశి. కాబట్టి వాటినే మనము నమ్మాలి.

ఇలా వేదాంతములోకి వెళితే బయటకు రావడము చాలా కష్టము. మీ అందరికీ తెలిసిన విషయాలనే మరలా ఇక్కడ పొందు పరిచినాను. నా గొప్పతనమేమియూ లేదు.

మీ
భాస్కరానందనాధ 

No comments:

Post a Comment

Note: only a member of this blog may post a comment.