Sunday 7 July 2013

శ్రీ మహాలక్ష్మి సాధన - 1


శ్రీ మహాలక్ష్మి సాధన - 1

శాస్త్రాలలో “ధర్మార్ధ, కామ, మోక్షాణా౦ పురుషార్ధ చతుష్టయం”.... అని మానవుని ఉన్నతిని కోరి నాలుగు రకాల పురుషార్ధములను చెప్పారు. వాటిలో మొదటిది ధర్మం, రెండవది అర్ధం, మూడవది కామం (కోరికలు, సంతానం), నాలుగవది మోక్ష ప్రాప్తికి తగిన సాధనాలు.

జీవితంలో ధర్మానికి ప్రధమ స్థానం ఇవ్వాలని, దానికి పెద్ద పీట వేయాలని, ధర్మ నియమాలను పాటించాలని, దైవం పట్ల, గురువుల పట్ల, గౌరవం, శ్రద్ధ వుండాలని మనకు శాస్త్రములు చెబుతున్నాయి. ధర్మాన్ని పాటిస్తూ లక్ష్మి సాధన ప్రాప్తి ఎలా పొందగాలమో ఇప్పుడు మనము తెలుసుకొందాము.

ధర్మము నుండే సంపద లబిస్తుంది. కానీ దానికి తోడూ సంపద కోసం ఈ పరుగుల జీవితములో, పోటీ ప్రపంచములో వ్యాపారం లేదా ఇతర పనుల ద్వారా ధనమును సంపాదించడానికి కొన్ని విశేష సాధనాలు, ప్రక్రియలు మనకు తంత్ర శాస్త్రములలో, వేదములలో, పురాణములలో చెప్పబడినవి.

దేవతలలో శ్రేష్టుడైన విష్ణు భగవానుని భార్యగా లక్ష్మి దేవికి స్థానం. శాస్త్రాలు ఆమె గొప్పతనాన్ని, మహత్వాన్ని చాటి చెప్పినాయి. లక్ష్మి యొక్క ఉపాసన మన జీవితాలలో ఎంతో ఆవశ్యకమైన ఉపాసన అనేది స్పష్టమైన మాట.  అయితే ఇతరులను మోసగించి, అనైతిక మార్గముల ద్వారా ధనాన్ని సంపాదించ కూడదు. గౌరవముగా శాస్త్ర నియమాలకు లోబడి, ధర్మ మార్గములో శ్రమించి ధనాన్ని సంపాదించాలి. ధనవంతుడు లక్షాధికారి కావడం నేరము కాదు, అధర్మం కాదు. దారిద్ర్యాన్ని పారద్రోలడమే శ్రీ లక్ష్మీ ఉపాసన. వేద సమ్మతమైన, శాస్త్ర సమ్మతమైన మార్గములలో శ్రీ లక్ష్మీ సాధన చేసి, శ్రీ మహా లక్ష్మి అనుగ్రహము ఎలా పొందడము అనేది ఈ శీర్షిక ముఖ్య ఉద్దేశ్యము. మన జీవితాలను సుఖమయం చేసుకోవడం ఎలాగా? శ్రీ మహాలక్ష్మి కటాక్షం పొందడం ఎలాగా? మన దురదృష్టాన్ని ఎలా తొలగించుకోవాలి? దారిద్ర్యాన్ని మార్చి శ్రీ సంపన్నులు కావడానికి ఒకే ఒక మార్గం సాధన. సాధన మన భాగ్యంలో మార్పు తెస్తుంది. అనుష్టానం వలన ఇది మనము సాధించ వచ్చును. అమ్మ యొక్క కృప పొంద వచ్చును. మన జాతక చక్రం మారి పోతుంది. నిశ్చితమైన సాధన ద్వారా ఇది సాధించ వచ్చును. మన తల వ్రాతలు మార్చు కోవచ్చును. అమ్మ మీద నమ్మకం వుండాలి. ధార్మిక మైన కోరికలతో, శుద్ధ సాత్విక రూపములో  శ్రీ లక్ష్మీ సాధన, మంత్ర సాధన  చేస్తే తప్పక మీ కోరిక నెరవేరుతుంది, మీ దారిద్ర్యము తొలిగి మీరు నిస్సంకోచముగా ధనవంతులు అవుతారు.

ధన ప్రాప్తికి ఆటంకాలుగా వున్న భాధలు దూరమౌతాయ్. ఉన్నతమైన ఉద్యోగము లభిస్తుంది, అనుకూలత ఏర్పడుతుంది, ప్రమోషన్లు లభిస్తాయి, అధికారుల వలన ఇబ్బందులు తొలగి పోతాయి, మానసిక ఆందోళన తొలగి పోతుంది, వ్యాపారములో సానుకూలత ఏర్పడుతుంది, లాభాలు సమకూరును, నష్టాలు తొలగి పోవును, చింతలు తొలగి, ప్రశాంత ఏర్పడును, ఇంటిలోని సమస్యలు తొలగి పోవును, ఆర్ధిక ఇబ్బందులు తొలగి పోవును. సంతానము కలుగును. జీవితములోని అన్ని సమస్యలు తొలగి పోవును, సుఖ సంతోషములు కలుగును.

౧, వరలక్ష్మీ వ్రతం :- శ్రావణ మాసములో ప్రతి మంగళ వారము కానీ, శుక్ర వారము కానీ వ్రత కల్పములో చెప్పిన ప్రకారము కలశం పెట్టి, శ్రీ మహా లక్ష్మికి షోడశోపచార పూజలు చేసి, అష్టోత్తరం చేసి, మహా నివేదన చేసి ఈ క్రింది మంత్రములలో ఏదైనా ఒకటి ద్వారా సాధన చేసి అమ్మ కృపకు పాత్రులు కండి. దీక్షా కాలములో నియములతో కూడిన నిష్ఠ అవసరము. నాలుగు శుక్ర వారములు 40 రోజులు ఒక మండలము శ్రద్ధతో చేస్తే అమ్మ కరుణ తప్పక అందరికీ కలుగును.

౧. కనకధారాస్తవము రోజుకు తొమ్మిది సార్లు వంతున 40 రోజులు శ్రద్ధతో, బ్రహ్మచర్యము, భూశయనము, ఏక భుక్తము, నియమములతో చేయ వలెను.

౨. ఓం శ్రీం హ్రీం శ్రీం కమలే కమలాలయే ప్రసీద ప్రసీద శ్రీం హ్రీం శ్రీం ఓం మహా లక్ష్మైనమః.

ఈ మంత్రమును 40 రోజుల లోపున లక్షా పాతిక వేలు శ్రద్ధతో నియమ నిష్టలతో జపించ వలెను.

౩. ఓం దుర్గే స్మృతా హరసి భీతి మశేష జంతో:
స్వస్థ్తై: స్మృతా మతి మతీవ శుభాం దదాసి
దారిద్ర్య దు:ఖ భయ హారిణి కా త్వదన్యా
సర్వోపకార కరణాయ సదార్ద్ర చిత్తా!
ఓం సర్వ మంగళ మాన్గల్యే శివే సర్వార్ధ సాధకే
శరణ్యే త్ర్యంబకే గౌరీ నారాయణి నమోస్తుతే

రోజుకు వెయ్యి చొప్పున 40 రోజులు శ్రద్ధతో నియమ నిష్టలతో జపించ వలెను.

సశేషం .....

మీ

శ్రీ భాస్కరానంద నాథ


 

No comments:

Post a Comment

Note: only a member of this blog may post a comment.