Thursday 18 July 2013

దశ మహా విద్యలు -2- మహా కాళీ


దశ మహా విద్యలు -2- శ్యామా కాళీ - మహాకాళి

 

శ్రీ విద్యాంతర్గతమైన దశ మహా విద్యలలో ఒకటైన శ్యామా కాళీ మహా విద్యను గురించి మంత్ర మహార్ణవము, మంత్ర మహోదధి, రుద్రయామళము, శారదా తిలక తంత్రం, ప్రపంచసార తంత్రము, కాళీ తంత్రము, భైరవ తంత్రము, పరుశురామ తంత్రం, దత్తాత్రేయ కల్పం, మార్కండేయ మహా పురాణం, త్రిపురా రహస్యం, దేవీ భాగవతం  మరియు శ్రీవిద్యా తంత్రములలో బహు చక్కగా చెప్పబడినది. ఉపాసనలో అనుభవమైన విషయములను మరియు మా గురు దేవుళ్ళ దగ్గర తెలుసుకొన్న అత్యంత గోప్యమైన విషయములను మీ ముందు వినమ్రతతో ఉంచుతున్నాను. సద్గురువుల ఉపదేశముతో చక్కగా అభ్యసించి, ఆచరించి ఆ తల్లి యొక్క దీవెనలను, అనుగ్రహమును పొందేదరని ఆశిస్తూ, ఆతల్లి మీద వున్న అచంచలమైన భక్తీ తో వ్రాస్తున్నాను. తంత్రం లేనిదే మంత్రం లేదు. మంత్రం లేనిదే తంత్రం లేదు. తంత్రం అంటే ఒక విధి విధానము. విధానము లేకుండా మంత్రము ఉండదు, ప్రతి మంత్రమునకు ఒక విధి విధానము వుంటుంది. అదే తంత్రము. మంత్రము యొక్క రేఖా చిత్రము యంత్రము. ఈ మూడు లేనిదే సాధన కుదరదు, పూర్తి గాదు.  ఇదియే త్రిపుటి.

బ్రహ్మ స్వరూపమైన కాళీని ఆది శక్తి అని చెబుతుంది మంత్ర మహార్ణవము. మొదట్లో దక్షిణ భైరవుడు కాళీ మాతను పూజించి ఉపాసన చేసినందువలన ఈమె దక్షిణ కాళిక అని పిలువబడుచున్నది. మార్కండేయ మహా పురాణంలో ఈ కాళిని నిత్య అనే పేరుతొ పిలువబడినది. ఈమె అవసరాన్ని బట్టి అనేక రూపములలో మనుషులకు, దేవతలకు, రాక్షసులకు శుభములు చేకూరుస్తూ వుంటుంది. మహాకాలుని వలెనే మహాకాళి కూడా సృష్టి వినాశనమును, సృష్టి సంహరమును అంత్య కాలము నందు చేసే మహా రుద్ర రూపిణి. కాలం నుంచే పదార్ధము పుట్టి, మరలా ఆ కాలం లోనే ఈ పదార్ధము అంతా కలిసిపోతుంది. ప్రళయాంతమున జరిగే మహా ప్రళయమునకు ప్రత్యక్ష సాక్షి ఈ మహా కాళి. తమో గుణానికి ప్రతీక అయిన ఈ మహాకాళిని ఉపాసన చేసిన వారికి తమోగుణం పూర్తిగా నశించి సత్వ గుణము వైపు ఏకోన్ముఖులు అగుదురు.

గురుపరం పరమైన శ్రీ విద్యలో అంతర్భాగమైన శ్రీ శ్యామాకాళీ మహా విద్యనూ మొదట ఉపాసించి, గురు రూపంలో విరాజమైన వారు శ్రీ దక్షిణామూర్తి రూపం లోని ఆ పరమ శివుడే. శ్రీ యంత్రాత్మిక మైన శ్రీ శ్యామా కాళీ మహా విద్య యంత్ర అధిష్టాన దేవత, పీఠశక్తి శ్రీ శ్యామా కాళీ మహా విద్యా దేవత. ఈమె సాధకుని అన్ని కోర్కలను ఈడేర్చగల దేవత, ఈమె ఒక్కటే అనేక కోర్కెలను తీర్చుటకు ఆదికాళి, దక్షిణ కాళీ, గుహ్య కాళీ, భద్ర కాళీ, శ్మశాన కాళీ, మహా కాళీ, సిద్ద కాళీ... మొదలగు అనేక రూపములలో భక్తు లను అనుగ్రహిస్తూ వుంటుంది. శ్రీ శ్యామా కాళీ మంత్రము పరానికే కాకుండా ఇహలోక కామ్య కోరికలను కూడా సిద్ధింప చేస్తుంది. మనలోని రాక్షస ప్రవృత్తిని, తమో గుణాన్ని దూరం చేసే సిద్ధ మంత్రము ఇది. ఈ మహా కాళీ విద్య దశ మహా విద్యలలో ప్రధమ స్థానము పొంది ఉన్నందువలన ఈ విద్య ప్రధమ మహా విద్య అని పిలువబడుచున్నది. ఈమె 16 సం.ల  వయసు గలిగి నీల వర్ణములో ఉన్నందువలన ఈమె శ్యామా కాళీ అని లోకంలో ప్రసిద్ది గాంచినది. కాళీ యంత్రము పది చక్రములతో గూడి విరాజిల్లుతూ వున్నది. అనేక రూపాలతో అనేక మంత్రములతో ఈ మహాకాళి మనకు ప్రసన్నమౌతూ వుంటుంది.

శ్యామా కాళీ మంత్రము:-

ఓం హ్రీం, శ్రీం, ఓం, క్లీం, హ్రీం, శ్రీం, ఐ౦, శ్యామా కాళ్యై స్వాహా !
ఇది త్రయక్షరీ యుక్త ఏకాదశాక్షరీ శ్రీశ్యామా కాళీ మహా విద్యా మంత్రము. ఈ క్లీం బీజములో అమ్మ "కాల సంఘర్షనీ" రూపములో విరాజమానమై వుంటుంది. కాల రాత్రికి ఈమయే చిహ్నము.    క్రీ౦ బీజ రూపములో కార్యా కార్యములు నెరుపుతూ ఆద్య కాళిగా వుంటుంది.  హ్రీం బీజ రూపములో మాయా స్వరూపిణియై, భువనేశ్వరిగా కొలువై వుంటుంది.  శ్రీం రూపములో శ్రీ మహా లక్ష్మిగా, ఐ౦ రూపములో శ్రీ మహా సరస్వతిగా ఈ మహా కాళీయే విభిన్న రూపములలో విభిన్న మంత్ర భీజములలో నిక్షిప్తమై వుంటుంది. ఈ మహా విద్యకు మంత్ర ద్రష్ట, ఋషి, గురువు  శ్రీ దక్షిణామూర్తి. చంద్ర, సూర్యాగ్నులే ఈమె యొక్క మూడు నేత్రములు. ఈమె నాలుగు చేతులలో అక్షమాల, అమృత కలశం, జ్ఞాన ముద్ర, పుస్తకములతో శోభితురాలై వుంటుంది. దివ్య వస్త్రములు ధరించి చందన, గంధముల లేపనముతో, మణి, రత్నముల ధారణతో ఈ ఆది కాళి సముజ్వలంగా వెలిగి పోతూ వీరాసనములో శ్రీ దక్షిణామూర్తి లాగ, గురు స్వరూపిణిగా విరాజమానురాలై వుంటుంది. పరాశక్తి పరమేశ్వరుని యొక్క ఇచ్చాశక్తి. పరమేశ్వరుని యొక్క శక్తియే ప్రకృతి. వాస్తవికముగా చూస్తే పరమేశ్వరునిలో జనించే ఉల్లాసములే ఆయన యొక్క శక్తి. ఈ శక్తి ప్రధమముగా ఇచ్చా రూపములో ఉన్నందువలన ఇచ్చా శక్తి అని, ఈ ఇచ్చా శక్తిని పరాశక్తి అని,;  జ్ఞాన శక్తిని పరాపరా శక్తి అని; మరియు క్రియా శక్తిని అపరా శక్తి అని అందురు. ఇదియే త్రిపురా రహస్యం. త్రిపురా శక్తి. దీనినే బ్రహ్మాశ్రిత మాయ అని అందురు. పరమేశ్వరుని యొక్క చిత్ స్వరూపము జ్ఞాన శక్తి వలన, పరమేశ్వరుని యొక్క ఆనంద స్వరూపము క్రియా శక్తి వలన, పరమేశ్వరుని యొక్క సత్ స్వరూపము ఇచ్చా శక్తి వలన తెలుస్తుంది.
 ఈ విధముగా పరమేశ్వరుని యొక్క సత్, చిత్, మరియు ఆనంద స్వరూపములు వరుసగా ఇచ్చా, జ్ఞాన, క్రియా శక్తుల వలెనే ప్రకటితమౌతాయి. కాబట్టి పరమేశ్వరుని యొక్క సచ్చిదానంద స్వరూపము పరమేశ్వరి యైన త్రిపురా దేవిదే. పరమేశ్వరుని యొక్క సచ్చిదానంద స్వరూపమే మహా త్రిపుర సుందరీ దేవి. ఈ శక్తియే పరాశక్తి రూపములో ప్రసిద్ది గాంచినది. అంటే వారిద్దరూ ఒక్కటే. అమ్మా, అయ్యా ఒక్కరే. ....

సశేషం....

మీ

శ్రీ భాస్కరానంద నాథ

No comments:

Post a Comment

Note: only a member of this blog may post a comment.