Wednesday 31 July 2013

About Bhaskarananda Natha...(SELF)


స్వపరిచయం

చతుస్సాగర పర్యంతం గో బ్రాహ్మణేభ్య శుభం భవతు
ఆంగీరస, భారహస్పత్య, భారద్వాజస త్రయా ఋషయ
ప్రవరాన్విత భారద్వాజస గోత్రః, ఆపస్తంభ సూత్రః,
యజుశ్శాఖాధ్యాయీ, రామచంద్ర శర్మా౦ అహంభో అభివాదయే.

నేను కామరాజుగడ్డ రామచంద్రరావును, భారద్వాజస గోత్రీకుడను, ఆరువేల నియోగి బ్రాహ్మణుడను. మేము స్మార్తులము

1982 లో నా జాతకము గురించి తెలుసుకొనే దానికి, నెల్లూరు లోని ప్రఖ్యాత జ్యోతిష పండితులు, శ్రీవిద్యోపాసకులు, సంస్కృత పండితులు అయిన శ్రీ కొట్రా వెంకట శేషయ్య శాస్త్రి గారి దగ్గరకు వెళ్ళినాను. వారు నా జాతకమును చూసి ఫలితములు చెప్పకుండా నన్ను ఆరు నెలలు తిప్పించుకొని, ఆపైన నాకు శ్రీవిద్యా మంత్రములైన బాల, నవాక్షరి, బగళ మంత్రములు ఇచ్చి నన్ను ఆశీర్వదించి పంపినారు.  అజ్ఞానాంధకారంలో కొట్టుకొని పోవుచున్న నాకు శ్రీవిద్యను అనుగ్రహించి, ఉపదేశించి వెలుగును చూపిన మహనీయులు  వారు. శ్రీవిద్య, శ్రీమాత అంటే ఏమిటో తెలియని నాకు జ్ఞాన బిక్ష పెట్టిన మహా మనిషి  శ్రీ కొట్రా వెంకటశేషయ్య శాస్త్రి గారు. అప్పటి నా వయస్సు 21 సంలు .. గురువులు ఇచ్చిన మంత్రములను జగన్మాత ఆజ్ఞగా భావించి, ఆమె అనుజ్ఞ లేనిదే శ్రీవిద్య లబించదని భావించి భక్తితో, నమ్మకముతో అక్షర లక్షలు జపము చేసిన వాడను. ఇది నా పూర్వ జన్మ సుకృతం. ఎన్నో పరీక్షలు, గురువుల దయతో ఒక్కోటి ఒక్కోటి దాటుకొని ముందుకు నడుస్తూ వస్తున్న వాడను.

అదే మొదలు నేను శ్రీ విద్యలోకి అడుగు పెట్టడము. నా తొలి గురువు వారె. ఆ పైన నేను శ్రీ విద్యోపాసన చేస్తూ, నవరాత్రులు ఆ తల్లిని తొమ్మిది రోజులు శ్రద్దగా పూజిస్తూ వస్తున్నవాడను. ఆరు సంవత్సరాల తరువాత మా గురువు గారు పరమ పదించినారు. గురువు లేని వాణ్ణి అయినాను, దిక్కు లేదు, దారి చూపే వాడు లేడు. గమ్యం అర్ధము కాలేదు. తల్లి కాళ్ళు పట్టుకొని ఎడ్చినాను మరలా గురువును చూపించమని, ఎన్నో రాత్రుళ్ళు నిద్ర లేకుండా వగచాను. 12 ఏళ్లు  గురువు గారు లేకుండా, తండ్రి లేని పిల్లవాణ్ణిగా, లలితా సహస్రనామములతో కాగితపు  శ్రీ చక్రము మీద పూజ చేస్తూ, 12 నవరాత్రుళ్ళు పూర్తి చేసినాను. నవరాత్రి పూజా మహిమ వృద్దా పోలేదు, ఆ తల్లి నన్ను కరుణించినది.  2000 సం. లో తెనాలి వాస్తవ్యులు బ్రహ్మశ్రీ వేమూరి లక్ష్మీనారాయణ  గారు నా శ్రద్దను, భక్తిని చూచి నాకు ఒకే సారి పంచదశి, షోడశి, మహా పాదుకలతో పూర్ణ దీక్ష  ఇచ్చినారు..   మా గురువులు నాకు ఇచ్చిన దీక్షా నామము భాస్కరానంద నాధ.   

 ఆ పైన వారు నాకు మహా విద్యను(500 మంత్రములు) కూడా ఉపదేశించినారు.  వారి దగ్గర మంత్ర, తంత్ర, యంత్ర  శాస్త్రములనుశ్రీ చక్రార్చన మొదలగునవి నేర్చుకొన్నాను. అటు పిమ్మట ఎన్నో తంత్ర, మంత్ర గ్రంధములను (సంస్కృత)  కాశీ చౌకాంబా సెంటరు నుంచి తెప్పించిపరిశోధించి, సాధన చేసి ఎన్నో విషయములను తెలుసుకొన్నవాడను,.
ఫ శ్రీశైలం దేవాలయం లో తపస్సు చేసి, అమ్మ అనుగ్రహమును, దీవెనలను పూర్తిగా పొందినవాడను.
ఎన్నో మంత్రములను స్వయముగా సిద్ది పొంది, తద్దేవతల అనుగ్రహమును పూర్తిగా  
పొందినవాడను. 

ఇప్పటి వరకు వృత్తిలో గాని, ప్రవృత్తిలో గాని ధనాపేక్ష లేకుండా, పై సంపాదన లేకుండా, న్యాయముగా, ధర్మముగా అమ్మ ఇచ్చిన జీతము డబ్బులతోనే బ్రతుకుతున్న వాడను. 

నాకు ఏ పీఠములు లేవు,  శిష్యగణము అంత కన్నా లేదు. అటువంటి ఆశ, ఆలోచన ఎన్నటికీ లేదు. శ్రీవిద్యను అమ్ముకొనే అధముడను కానే కాను. పేరు ప్రతిష్టల కోసం కాదు. ఖాళీ సమయము లలో నేను తెలుసుకొన్న విషయములను గ్రంధస్థం చేయు చున్నాను. పూర్తిగా ఇది నిస్వార్ధ మైన సేవ. 

మోక్ష సాధన కొరకు, ఆత్మ జ్ఞానము కొరకు మాత్రమే ఈ శ్రివిద్యను వినియోగిస్తు వస్తున్న వాడను. ఆ రకముగా మా గురువుల వద్ద ప్రమాణము చేసి వున్న వాడను.  30 ఏండ్ల సాధనతో ముందుకు నడుస్తున్న వాడను.  ఇప్పటి వరకు ఎవ్వరికీ ఏ  అపకారము తలపెట్ట లేదు. నా ఆత్మ ఉన్నతి కొరకు మాత్రమే  ఈ శ్రీవిద్య ను ఉపయోగిస్తూ వస్తున్న వాడను. 

ఇది కేవలము నా ఆత్మ ఉన్నతి , ఉద్దతి కొరకు మాత్రమే గాని ఇతరులకు ఉపదేశము చేయుటకు కాదు. జ్ఞాన సముపార్జన కొరకు మాత్రమే.  

నేను గురువును కాను, జ్ఞానిని, సాధువును, సన్యాసిని  కాను. యోగి ని గాను, పీఠాధిపతిని కానే కాను.

ఒక మామూలు గృహస్థుడను, ఒక సాధకుడను, ఒక ఉపాసకుడను మాత్రమే.

శ్రీ శృంగేరీ శ్రీ విరూపాక్ష శ్రీ పీఠాధీశ్వర
శ్రీవిద్యాశంకర పదమావేశ ప్రకాశిత
శ్రీ జగద్గురు శ్రీ శ్రీ శ్రీ కల్యాణానంద భారతీ మహాస్వామి (శ్రీ విద్యారణ్యుల వారి అవిచ్చిన్న గురుపరంపరలో 42వ జగద్గురు) వారు మా పరమేష్టి  గురువులు.  స్వచ్చమైన గురుపరంపరలో వస్తున్నవాడను.

కావున నేను శ్రీ శృంగేరీ శంకరాచార్య సాంప్రదాయములోని వాడను. నమ్మినవాడను. ఆ పరంపరలో దీక్ష తీసుకున్నవాడను.   స్మార్తులము మేము. సకల దేవతారాధనే మా మతము. శివునికి విష్ణువుకి అభేదము అని గాఢముగా, ధృఢముగా నమ్మే వాళ్ళము మేము.

జగద్గురువులు శ్రీ శంకరాచార్య భగవత్పాదులు మా గురువరేణ్యులు. ఆదిగురువులు. వారి పరంపరలో వస్తున్న వాడను, వారి మాటలు నాకు శిరోధార్యము. వారి మాటలను, వారి సిద్దాంతములను, వారి అడుగుజాడలలో నడవడము నా ప్రధమ కర్తవ్యము అయివున్నది. జగద్గురువులు ఆది శంకరాచార్యల పరంపర మాది. ఇది మా గురు పరం పర.


నాకు తెలిసిన, నేర్చుకున్న విషయములను పదిమందితో పంచుకోవాలన్న సత్ సంకల్పముతో ముందుకు సాగుతున్నాను.


  గురువుల ఆజ్ఞ మేరకు, శ్రీవిద్యావ్యాప్తి కొరకు నా వంతు సహాయమును చేస్తున్నాను. జగములకు తల్లి అయిన ఆ శ్రీమాతను గురించి నాకు తెలిసిన, నేను తెలుసుకొన్న నాలుగు మాటలు ఇతరులకు చెబుతున్నాను.

 ఇష్టము వున్నవాళ్ళు స్వీకరించ వచ్చును, ఇష్టము లేని వాళ్ళు త్రుణీకరించనూ వచ్చును. ఎవరి అభిమతము వారిది. తెలిసినది కొంతే అయినా, తెలియనిది చాలా వున్నది.

 ఓం శాంతి: శాంతి: శాంతి:.

మీ
భాస్కరానంద నాథ /05-04-2012

మహాపాదుకాంత శ్రీవిద్యాపూర్ణ దీక్షాపరులు
(కామరాజుగడ్డ రామచంద్రరావు )

No comments:

Post a Comment

Note: only a member of this blog may post a comment.