Monday, 29 July 2013

మహాకాళీ సాధన - 3


మహాకాళీ సాధన
దశ మహా విద్యలు - శ్యామా కాళీ-3

ధర్మార్ధ కామ మోక్ష చతుర్విధ పురుషార్ధ ఫల సిధ్యర్ధం, మనో వాంఛా పరి పూర్ణార్ధం, ఉత్తరోత్తర జన్మ ప్రాప్యర్ధము, సకలైశ్వర్య సత్సంతానా వ్యాప్త్యర్ధము, ఆయురారోగ్య, సుఖ వైభవ  ప్రాప్యర్ధ౦, జనులు దేవతల యొక్క ఉపాసనా పరులౌతారు. ఇందులో ఎలాంటి సందేహము లేదు. త్రిమూర్తులు జగత్ సృష్టి, పాలన, సంహార కర్తవ్యములను నిర్వర్తించ కలగడానికి పరాశాక్తియే కారణము. వారికా శక్తులను నిచ్చినది ఆ పరాశక్తియే. అయితే ఈ శక్తి స్త్రీ లింగమా లేక పుం లింగమా, నపుంసక లింగమా అని ఆలోచిస్తే, ఈ వివక్షతలు ఏవీ లేని పరాశాక్తియే అని దేవీ భాగవతం చెబుతుంది. ఉన్నది ఒక్కటే. అదే రెండుగా కనిపిస్తుంది. అదే పర బ్రహ్మం, అదే పరాశక్తి. అదే బిందు స్వరూపం. అదే కామేశ్వరాంకస్థ నిలయా. ఆమె లోనే ఆయిన వున్నాడు. ఆయిన లోనే ఆమె వున్నది. శివ శివాని ఒక్కరే. చూచే వారిదే బేధము.

మహాకాలుడు, మహా కాళి ఒక్కరే. నీకు ఇష్టమైన రూపములో నీవు చూడవచ్చు.  మహాకాలుని విలయతాండవమే మహా కాళి. కాలమే మహా కాళి. శరీరములో ప్రతి కణం ప్రతి క్షణం చస్తూ, బ్రతుకుతూ వుంటుంది. అదే మహా కాలుని విలయ తాండవము.                   అదే మహాకాళి కరాళ నృత్యం. ప్రపంచాన్ని దాని పరిమాణాన్ని శాసించే మహా శక్తియే మహా కాళి. అంతమే ఆదికి మూలం. తరగడమే పెరగడానికి నాంది. ప్రళయమే సృష్టికి నాంది. కాళిమాత ప్రాణ క్షేత్రం, చేతనా క్షేత్రం, ఇచ్ఛా, జ్ఞాన, క్రియా శక్తులకు కేంద్రం. ఆమె ఈ సృష్టికి గర్భ కోశం. ఈ బ్రహ్మాండమే ఆమె యోని. ఆమెయే మన అందరికీ తల్లి.

కావ్యకంఠ శ్రీ గణపతి ముని వర్యులు ఈ మహా కాళీని పరిణామ శక్తిగాను, విద్యుచ్చక్తిగాను, స్త్రీ లింగ రూపమైన కాల శక్తిగాను, తాండవ రూప మెత్తిన కాలపాకజ క్రియాశాక్తిగాను, అండా౦డ పిండాండ బ్రహ్మాండాల సంహార శక్తి గాను, సృజనాశక్తిగాను, ప్రాణ శక్తిగాను, ఉచ్చ్వాస నిశ్వాసాలను నియత్రించే రసజ్ఞా బీజంగాను, జీవ శక్తిగాను, చేతనా శక్తిగాను, ఆమె ఖడ్గం సంసార జీవితమును ప్రహరణ చేసే తాడన శక్తిగాను, మాహాకాలుని నాట్యకళగాను, యోగులకు హస్త స్వాధీనమైన ముక్తి ఖడ్గంగాను అభి వర్ణించినారు.

ఎకమేవా ద్వీతీయం బ్రహ్మ నిత్యం సనాతనం. ద్వైత భావం పునర్యాతి కాల ఉత్సిత్సు సంజ్ఞకే.

సదైకత్వం నభేదోzస్తి సర్వ దైవ మమాస్యచ, సోzసౌ సాహమహం యోzసౌ భేదోzస్తి మతి విభ్రమం.  

నేనూ అతడూ ఒకరమే, మాకు భేదాలు లేవు. నేనే పురుషుడు, నేనే స్త్రీ ని. అజ్ఞానం వలెనే భేద భావం కలుగుతుంది. అత్యంత సూక్షమైన మా అంతరాన్ని లోక బంధాల నుండి విముక్తులైన బుద్ధి మంతులే గుర్తించ గలరు. ఇందుకు సందేహము లేదు. సృష్టి కాలములో బ్రహ్మము ఏకముగా, అద్వితీయముగా, సనాతమైనదిగా వుండేది. సృష్టి కార్య నిమిత్తము నేనే రెండుగా గోచరింప బడుతాను. ఉపాధి భేదం వలన ఒక దీపం బహు దీపాలైనట్లు, మాయా ప్రభావం వలన అద్దంలో ప్రతిబింబం భిన్నముగా కనిపించి నట్లు, నీడ వేరుగా కనిపించి నట్లు ద్వైత భావం ఉదయిస్తుంది. అజాయమానుడే బహుధాత్వాన్ని ప్రదర్శిస్తాడు. సృష్టి నిమిత్తకారణముగా నేనే బహు విధములుగా కనిపిస్తాను. కానీ వున్నది ఒక్కటే.”

“శక్తి జ్ఞానం వినాదేవి ముక్తి: హాస్యాయ కల్పతే”

ఉపాసన అంతా ఈ అద్వితీయ శక్తికే జరుగ వలసి వుంటుంది. కాబట్టి శ్రీ చక్రములోని బిందువు అటు పురుషుడు కాడు, ఇటు స్త్రీ కూడా కాదు, కానీ రెండూ అదే. అయ్యలో అమ్మ, అమ్మలో అయ్య వున్నారు. అయ్య యొక్క శక్తి అమ్మ. బిడ్డ పుట్టితే గానీ స్త్రీ, (ప్రకృతి) తల్లి కానేరదు, తల్లి ఉంటేనే కాని బిడ్డ పుట్టదు. ఈ మర్మము అర్ధం చేసుకోన్నవాడే సాధకుడు, ఉపాసకుడు. సృష్టి యొక్క మూల సూత్రం ఇదే. కనుక తంత్ర సాధన ఉపాసన అంతా స్త్రీ మూర్తికే జరుగుతుంది. ప్రకృతి లోని అఖండ భౌతిక శక్తుల పరిణామం, విద్య, అవిద్య అన్నింటికీ అతీతమైన మాహా స్థానాన్ని మన: పరిధుల్లో మనస్సు ప్రయాణం చేసే మార్గం అది. అదే ప్రకృతిని మాతృమూర్తిగా అర్ధం చేసుకొనే పద్ధతి. అదే మహా విద్య. మహావిద్యోపాసకులకు  మంత్ర, తంత్రములు అన్నీ మనసులోనే జరిగి పోతూ వుంటాయి. అదే అంతర్యాగము.  ఇక వారికి భాహ్య పూజలు అక్కర్లేదు. ఆ అమ్మ వారితోనే తిరుగాడుతూ వుంటుంది. వారి మనసులోనే వుంటుంది. అమ్మకి, వారికీ అభేదము.

పర బ్రహ్మానికి మాయ అనే ముసుగు వేస్తే పరాశక్తి, ముసుగు తీసేస్తే పరాశివుడు. అదే మూలం. అదే చిదంబర రహస్యం. అటువంటి మహా కాళి యొక్క ఉపాసన చాలా సులభము. మనలోని తమో గుణాన్ని, అహంకారమును పారద్రోలే మహా తల్లి. అహంకారమును ఆమెకు బలి ఇస్తే తక్షణమే ప్రసన్నమౌతుంది.  మనలోని రాక్షసులను, అసురీ గుణములను  సంహరించే మహా కాళి ఆమె. ఈ సృష్టికి మూలం ఆమె. అందరికీ మాతృమూర్తి.

ధ్యాన శ్లోకం.

మహా కాళీ ధ్యానం

శవారూఢా౦ మహాభీమాం  ఘోర దంష్ట్రా౦ వర ప్రదాం

హాస్య యుక్తా౦ త్రినేత్రా౦చ కపాల కర్ర్తికా కారా౦

ముక్త కేశీ౦ లలజ్జిహ్వ౦ పిబంతీం రుధిరం ముహు:

చతుర్బాహు యుతాం దేవీం వరాభయ కరాం స్మరేత్||

 

శవారూఢా౦ మహాభీమాం  ఘోర దంష్ట్రా౦ హసన్ముఖీ౦

చతుర్భుజాం ఖడ్గముండ వరాభయ కరాం శివాం

ముండ మాలాధరాం దేవీం లలజ్జిహ్వాం దిగంబరాం

ఏవం సంచింతయేత్కాళీ౦ శ్మశానాలయ వాసినీం ||

జప మంత్రము :-

౧. ఓం క్రీ౦ క్రీ౦ క్రీ౦  xxxxx xxxxx xxxx xxxx xxxx xxxx   స్వాహా. (సిద్ధ మంత్రము)

౨. అధర్వణ భద్ర కాళీ మంత్రము ...xxxx xxxx xxxx xxxx xxxx

౩. మహా కాళీ మంత్రము ... xxxx xxxx xxxxx xxxxxx

౪. క్రీ౦ క్రియా బీజం. కాళీ బీజం.

మహా కాళీ ఉపాసన:-

చండీ నవాక్షరీ మంత్రం సిద్ది పొందిన వారు, కాళీ మాత పూజకు, ఉపాసనకు అర్హులు. ఆతల్లి యొక్క శక్తిని  తట్టుకోగలరు.

పూర్తి మంత్రము సద్గురువుల వద్ద నుంచి ఉపదేశముగా పొంది ఉపాసన చేయవలెను.

మహావిద్య అయిన శ్రీ మహాకాళీ తంత్రములో షుమారుగా 257 మంత్రములు వివిధ ధ్యాన శ్లోకములతో  చెప్పబడినవి. కానీ గురు పరంపరలో సిద్ధ గురువులు చెప్పబడినదే మూల మంత్రము. పై ఈ మంత్రమును శ్రీరామకృష్ణులు వారు ఆచరించి సిద్ది పొందినారు. శ్రీవిద్యా సాంప్రదాయములో  పూర్ణ దీక్షాపరులకు మాత్రమే ఈ మంత్రము చెప్పబడుతుంది.   మహావిద్య ఉపాసన గలిగిన వారికి ఈ మహాకాళి సాధన బహు శీఘ్రముగా ఫలించును. అమ్మ దర్శనం లభించును. వారి వారి మానసిక పరిస్థితులను బట్టి అమ్మ వివిధ రూపాలలో కనిపించును.

మహావిద్య ఉపాసన గలిగిన వారు మాత్రమె ఈ దశ మహావిద్యల ఉపాసనకు అర్హులు. అర్హత అనుసరించి సద్గురువుల వద్ద విధి విధానములను, సూచనలను, మర్మములను, నియమములను,  అంగన్యాస, కరన్యాసములను, ధ్యాన శ్లోకములను, కవచం, స్తోత్రం, మొదలగునవి జాగ్రత్తగా  తెలుసుకొని సాధన ప్రారంభించ వలెను. వైదిక మార్గములో సాధన చేసే వారికి వయో వస్థా వివర్జిత అయిన ఆ మహాకాళి పరికిణీ కట్టుకొని ఎగురుతూ నడిచే బాలికగా కనిపిస్తుంది. మహాకాళి అయినా కన్న తల్లిగా, కన్న బిడ్డగా దర్శనం ఇస్తుంది. అవైదిక మార్గములో సాధన చేసిన వారికి కోరలతో నోరు తెరిచి రక్తాన్ని త్రాగే త్రిలోక భయంకర రాక్షసిగా అమ్మ దర్శనం ఇస్తుంది.

 

విద్యుచ్చక్తి లేక మెరుపుగా జిగిల్లుమనే నీల మేఘమే కాళీమాత. విద్యుత్తే ఆమె సౌందర్యం.

కాళీ ఉపాసకులు కాళీలో ప్రాణ శక్తిని మాత్రమే చూస్తారు, వృద్దునిలో శిశువును, శిశువులో వృద్దుని చూస్తారు. దేవి కాల రూపిణి గనుక వర్షా మేఘం వంటి నల్లని శరీరాన్ని ఉపాసనలో చూస్తారు. అనాహత చక్రం దేవి నివాసం అంటే గుండెకాయ. గుండెకాయ ప్రతి నిత్యం రక్తంలో మునిగి రక్తాన్ని పీల్చి విడుస్తూ ఉంటుంది. అందుకనే ఆమెను రక్తకాళీ అంటారు. గుండె ద్వారాలకు అమర్చబడిన కవాటాలు, తెరుచుకొంటూ, మూసుకొంటూ ఉండే వాల్వులు, దేవి జిహ్వలు. కాళికాదేవి శరీరమే జగత్ప్రలయ రాత్రి మేఘ విద్యుల్లతల సన్నివేశం, భావ భావ కళా జగత్సర్వాన్ని ప్రదర్శిస్తుంది.  

కాళీ మాత అంటే కాలం, సృష్టి అంటే ఆ తల్లి కనే సంతానం, తల్లి లేకుండా  పిల్లలు పుట్టరు. అంటే ప్రసవణీ ధర్మం ఉన్నదే తల్లి. అది ఆడపుట్టుక ధర్మం. కాబట్టి సృష్టికారిణి అయిన దేవి ప్రసవ ధర్మిణి అయిన కారణంగా స్త్రీ దేవతగానే ఆ పరతత్వాన్ని పూజించాలని మంత్ర మహోధది  చెబుతుంది.  అమ్మ అమ్మయే. పర బ్రహ్మం నకు చీర కడితే పర దేవత అవుతుంది.  భద్రకాళి, మహాకాళి, రుద్ర కాళి అయినా నాకు ఆమె కన్న తల్లియే. ఆమె లేనిదే ఈ భాస్కరుడు లేడు.

జయంతీ మంగళా కాళీ భద్ర కాళీ కపాలినీ,

దుర్గా క్షమా శివా ధాత్రీ స్వాహా స్వథా నమోzస్తుతే ||

ఇతి నమస్కారః
 

మీ
శ్రీ భాస్కరానంద నాథ / 23-07-2013

పూర్తి సమాచారము కొరకు దర్శించండి :-

No comments:

Post a Comment

Note: only a member of this blog may post a comment.