Sunday 10 June 2012

శ్రీమాత- శ్రీచక్రము -2


 శ్రీమాత- శ్రీచక్రము -2

శ్రీవాగ్దేవీం మహాకాళీం, మహాలక్ష్మీం, మహాసరస్వతీం,
త్రిశక్తి  రూపిణీమంబాం, దుర్గాం చండీం నమామ్యహం.

శ్రీమాత ప్రకృతి రూపిణి అయి,నిత్యానంద రూపమై 50 అక్షరములతో శబ్దార్ధ రూపమై ఈ ప్రపంచమంతా వ్యాప్తి చెందివున్నది. దీనినే ఋషులు శబ్దబ్రహ్మ అంటారు. ఇదే మూలధారములో చైతన్య రూపములో నుండి సుషుమ్నా మార్గము ద్వారా సహస్రారమందుండు చంద్ర మండలము వరకు గమనము చేయుచూ సమస్త వర్ణముల పుట్టుకకు, సమస్త మంత్రముల ప్రాదుర్భావమునకు హేతువైనది.
అట్టి తేజోరూప వాగ్దేవతకు నమస్కరిస్తూ, ఆ పరదేవత అనుగ్రహించిన మేర నాకు తెలిసిన నాలుగు మాటలు అమ్మ గురించి, అమ్మకు నిలయమైన శ్రీచక్రము గురించి మీతో పంచుకొందామని చేసే చిన్న ప్రయత్నం ఇది.

సనాతనుడైన శివుడు రెండు ప్రకారములుగా, నిర్గుణ-సగుణ భేదములచే ప్రకటితమై వున్నాడు.
ప్రకృతితో కలసియున్నప్పుడు సగుణుడు, లేనప్పుడు నిర్గుణుడు. వేదాంతమందు ప్రకృతిని అవిద్య అని, శైవులు శక్తి అని, శాక్తేయులు మహా మాయ అని, వైష్ణవులు విష్ణువు అని  అంటారు.
స్త్రీ రూపములో ఆ పర దేవతను శక్తిగా కొందరు కొలిస్తే, మరి కొందరు పురుష రూపంలో విష్ణువుగా కొలుస్తున్నారు.  బాలాజీ అయినా బాలా త్రిపుర సుందరి అయినా రెండూ  ఒకటే రూపము.
శ్రీ రామో లలితాంబికా” – అని పెద్దలు అన్నారు.
నామ రూపాలకు అతీతమైన నిర్గుణ పర బ్రహ్మం, సత్-చిత్-ఆనంద రూప ఐశ్వర్యముచే పూర్ణుడైన సగుణ పరమేశ్వరుడు, త్రిగుణాతీతుడు  ప్రకృతితో కలియుటచే ఏర్పడిన శక్తి వలన నాదము, నాదము వలన బిందువు ఏర్పడినవి.

పరమేశ్వరుని యొక్క శక్తి (ప్రకృతి) ప్రళయకాలంబున, సూక్ష్మమైన అనాది అయిన చైతన్యంతో కలసియుండును. సృష్టి కాలమందు, మరల పరమేశ్వర సంయోగముచే,
త్రిగుణముల తో కలసి, ప్రపంచ కార్యమందు సూక్ష్మమైన స్థూల రూప జగత్తును ప్రభవింప చేయును. దీనినే బీజమునందు మహా వృక్షము దాగినట్లు అని అందురు.
పరాశక్తి మయమైన బిందువు మూడు రూపములుగా విభాజితమై యుండును.
౧. బిందువు  ౨. నాదము  ౩. బీజము
బిందువు లోనుంచి నాదము, నాదము లోనుంచి బీజము ఉద్భవించినవి.
అంత్య కాలమందు బీజము నాదములో, నాదము బిందువులో విలీనమగును.  అప్పుడు పూర్ణమగును.
బిందు రూపములో ఆ పరమ శివుడు మహాకారణ బిందువై వుండును.
బిందువు, నాదము, బీజము ఈ మూడింటి కలయకచే త్రిమూర్తులు, త్రిశక్తులు, త్రిగుణములు  ఏర్పడినవి.
త్రయాణా౦ దేవానాం త్రిగుణ జనితానాం తవ శివే

శివ శక్తి సమావేశము వలన నాదము పుట్టును.
బిందువునే మహా కారణ బిందువు అని అందురు. ఈ బిందువు స్త్రీ పురుష సమ్మేళనము. ఈ మహా బిందువే పర బ్రహ్మ స్వరూపము. పరమాత్మ, సచ్చిదానంద స్వరూపము.
ఇదే ఓంకారము.  బిందువు శివాత్మకము. బీజము శక్త్యాత్మకము.     ప్రకృతీ, పురుషులు, కామకామేశ్వరులు.
బిందువు నందు వున్న మాయా శక్తి విజృ౦భణ చేత ఈ మహాకారణ బిందువు వికసించి, అఖండ స్పోటాత్మక శబ్దముచే అఖండ నాదము పుట్టి, మూడు బిందువులతో త్రిభుజాకారపు చక్రము ఏర్పడుచున్నది. సత్వ, రజ, తమో గుణాల ప్రతి రూపమే ఈ మూడు బిందువులు. ఈ మూడు బిందువులే సగుణాకారమై బ్రహ్మ, విష్ణు, శంకరులుగా మారుతున్నవి.
అదే క్రమములో మహాకాళి, మహాలక్ష్మీ, మహాసరస్వతీ ఉద్భవించినారు.
           
..................................................................... సశేషం.


మీ
భాస్కరానందనాథ
(కామరాజుగడ్డ రామచంద్రరావు)
మహావిద్యోపాసకులు, మహాపాదుకాంత శ్రీవిద్యాపూర్ణ దీక్షాపరులు



No comments:

Post a Comment

Note: only a member of this blog may post a comment.