Sunday, 10 June 2012

భరతభూమి వైశిష్ట్యం


భరతభూమి వైశిష్ట్యం
ఈ భరతభూమి వైశిష్ట్యం ఇంకా వర్ణనాతీతమైనది. ఈ దేశవాసులదే - అసలైన అదృష్టమంటే! శ్రీమన్నారాయణుడు ఈ భరత వర్ష వాసులకు కఠోర తపస్సులు, యజ్ఞాలు, వ్రతాల ప్రసక్తి లేకుండా కేవలం భక్తితో నామ జపాన్ని చేసినా....అంటే - పిలిస్తే చాలు! పలుకుతాడన్న మాట!
శ్లో|| కల్పాయుషాం స్థాన జయాత్పునర్భవాత్‌ |
క్షణాయుషాం భారత భూజయో వరమ్‌ ||
క్షణేన మర్త్యేన కృతం మనస్వినః |
సం న్యస్య సం యాత్య భయం పదం హరేః ||
వందల - వేల ఎల్ల తరబడి ఆయుష్షున్న చోట పుట్టి ఏం లాభం? ఓ క్షణకాలం ఆయుష్షుతోనైనా సరే భరతభూమిపై జన్మించడం గొప్పవరం. శ్రీహరి స్వయంగా ప్రసన్నుడై తన పట్ల భక్తిని - స్పృహనీ కల్గించే ఈ చోట ఆయన అభయ ప్రదానం అందరికీ అందుతూంటుంది మరి!
శ్రీమన్నారాయణ కథాగానం జరగని చోటు - సాధు సత్పురుషులెవరూ వసించని చోటు - యజ్ఞ యాగాదులు జరగని ప్రదేశం ఇంద్రలోకమే కావచ్చు! దానికి తుల్యమైనదే కావచ్చు!..అది నివశించదగినది కాదు. ఒకసారి ఈ నేల మీద జన్మించిన వారు, తిరిగి చెట్టుగానో - పూల తీగగానో ఇక్కడే జన్మించాలని కోరుకుంటారంటే భరతభూమి వైశిష్ట్యాన్ని ఇంకా వివరించాలా? ఈ నేలతో ఏర్పడే అనుబంధం అట్లాంటిది.
భరతవర్షంలో యజ్ఞ గుండాలలో సభక్తి - సమంత్రయుతంగా సమర్పించే హవిస్సులను సంతోషంగా స్వీకరిస్తారు దేవతలు. యజ్ఞపురుషుడైన శ్రీహరి సర్వదా ఇక్కడివారిని అశీర్వదిస్తు కోరికలున్నవారినీ లేనిరినీ ఒకేరీతిగ కరుణిస్తుంటాడు. స్వర్గతుల్యమైన భారతదేశ మహాత్మ్యాన్ని దేవతలూ - ఋషులూ - సిద్ధులూ చెప్పగా విని, అదే నీకు వివరిస్తున్నాను నరద మహర్షీ! ఇప్పుడు మిగిలిన ప్లక్ష, కుశ, శాల్యలాది ఆరు ద్వీపాల గురించీ నే నెరిగివున్న విశేషాలు తెలియజేస్తాను" అన్నాడు. నారాయణ ఋషి.
ప్లక్షాది ద్వీపషట్కం
"నారదమహర్షీ! ప్లక్షద్వీపం కూడా వైశాల్యంలో జంబూద్వీపంతో సమానమే! ఇక్కడ హిరణ్మయుడు - అగ్ని, ఏడునదులూ, ఏడు దేశాలూ ఉన్న పవిత్ర భూమి ఇది. పర్వతాలు కూడా ఏడు సంఖ్యలోనే ఉన్నాయి.
ఈ ద్వీపంలో ఆయుఃప్రమాణం వెయ్యి సంవత్సరాలు. ఇక్కడా చాతుర్వర్ణ వ్యవస్థ ఉంది. వేదంలో చెప్పబడిన మార్గాన ఇక్కడి వారు సూర్యోపాసన చేస్తుంటారు. ఇక్షు సముద్రం ఈ ద్వీపాన్ని పరివేష్టించి ఉంది.
ప్లక్ష ద్వీపానికి రెండింతలు పెద్దది - శాల్మల ద్వీపం. ఇది సురా సముద్ర వలయుతం. ఇక్కడ కూడా - ప్రియవ్రతుడు అనుసరించిన విధానం (ఏడు దేశాలను ఏడుగురు కొడుకులకు పంచి ఇవ్వడం..) అతని పుత్రుడైన యజ్ఞబహుడు అవలంబించాడు. ఇందులోనూ ఏడు దేశాల్తో పాటు ఏడు నదులు - ఏడు పర్వతాలూ ఉన్నాయి. చంద్రుడు ఇక్కడ అధి నాయకుడు. ఈ ద్వీపానికి దగ్గరలోనే ఉంది - కుశద్వీపం. ఈ ద్వీపం ఘృత సముద్రం పరివేష్టితం. ఇక్కడో గొప్ప కుశస్తంభం అన్ని దిక్కులకూ వెలుగులను విరజిమ్ముతూ ప్రకాశిస్తుంటుంది. ఏడు సంఖ్యలోనే ఇక్కడా దేశ - నది - పర్వతాలున్నాయి. వీరు కూడా అగ్ని ఉపాసకులే!
ఈ ద్వీపానికి చేరువలోనే ఉంది - క్రౌంచద్వీపం. ఇది కుశద్వీపానికి రెండింతలుంటుంది. దీని చుట్టూ ఉన్నది క్షీర సముద్రం. పూర్వకాలంలో కుమారస్వామి ఇక్కడి క్రౌంచ పర్వతాన్నే తన శక్తితో రెండుగా చేధించాడు. ఇక్కాడా 7 నదులూ, 7 దేశాలున్నాయి. చాతుర్వర్ణ వ్యవస్థ ఉంది. వరుణోపాసన.
దీనికి ఆవల ఉన్నది శాక ద్వీపం - దధిమండ(వెన్న) సముద్రముంది. శాకవృక్షం వల్ల ఈ ద్వీపాని కీ పేరు వచ్చింది. సప్త సంఖ్య మామూలే! ఈశ్వరుడు ఉపాస్య దేవత. చాతుర్వర్ణ వ్వ్యవస్థ ఉంది.
దీనికి రెండు రెట్లు పెద్దది - పుష్కర ద్వీపం. ఇది శుద్ధ జలం మధ్యలో ఉంది. లక్ష బంగారు రేకుల పద్మం ఈ ద్వీపాని కీ పేరు కలిగించింది. ఇది బ్రహ్మకు ఆసనం, కనుకనే మహర్షుల వ్యవహారం ప్రకారం - ఇది మానసోత్తరం. ఈ ద్వీపానికి పాలకులు ఇద్దరే! రెండే దేశాలు. ఈ దేశాలకు సరిహద్దుగా అవధిగిరి అనే మహాపర్వతం ఉంది. దీని యెత్తు లక్షయోజనాలు. దీనికి శిఖరాన నలుదిశలా దిక్పాలకుల కోసం నాలుగు పట్టాణాలున్నాయి. ఈ పర్వతం పైనుంచే సూర్యోదయం జరిగేది. మనకు - సంవత్సర కాలం అంటే - దేవతల కొక పగలూ - రాత్రీ.
లోకాలోకాచలం
దీనికి పైన ఉన్నది - లోకాలోక పర్వతం. పంచాశత్కోటి విస్తీర్ణమైన భూగోళంలో ఈ పర్వతం ఒక్కటే నాల్గవ వంతు భాగాన్ని ఆక్రమించింది. స్వమాయా రచిత విశ్వం, ఇక్కడ విష్ణువుకు వెలుపలా - లోపలా ఉంటుంది. వెలుపల ఉండేది లోకం. లోపల ఉండేది అలోకం. ఇది శ్రీహరి నివాసం. లోకలోకాలకు (విశ్వాంతరాళం లోపల) అతీతుడైన - అంతటా నిండి ఉన్నవాడు అ హరి. అక్కడ ప్రాణి నివాసం ఉండదు. అక్కడ ప్రవేశించిన పదార్థమేదీ తిరిగి కనిపించదు. విష్ణ్వైక్యం అయిపోతుంది.
శ్లో|| ఈశ్వరేణ సలోకానాం త్రయాణా మంతగః కృతః |
సూర్యాదీనాం ధ్రువాంతానాం రశ్మయో యద్వశాదిహ ||
ముల్లోకాలకూ చిట్టచివరి పర్వతంగా ఈ లోకాలోక పర్వతాన్ని ఉంచాడు పరమేశ్వరుడు. సూర్యుడు, ధృవ నక్షత్రం వంటివి ప్రసరించే కాంతులు దాన్ని తాకి ప్రతిఫలించాల్సిందే (పరావర్తనం చెందవలసిందే) కాని దాన్ని దాటి ఆవలకు పోవడం జరగదు. అంత ఎత్తూ - విస్తృతీ గా పర్వతమది.
ఇంకా - ఈ పర్వతం పైనే బ్రహ్మదేవుడు నాలుగు మహాదిగ్గజాలను (వామన, అపరాజిత, పుష్పచూడ, ఋషభ అనే పేర్లు గలిగిన వాట్ని) నిలబెట్టాడు. ఇవే సమస్త లోకాలకూ స్థితి - హేతువులని పెద్దల ఉవాచ.
   జంబూ ద్వీప స్వరూపం
ద్వీపాలూ, అందులోని దేశాలు అని ఏమేరకు విస్తరించాయో తెలియజెపుతాను. విను!...లక్షయోజనాల విస్తీర్ణంలో - ఒక్కొక్కటే తొమ్మివేల పైచిలుకు యోజనాలమేర ఆక్రమించే 9 దేశాలు (ఆకాలంలో 'వర్షాలు' అనేవారు) ఉన్నాయి. సుదీర్ఘ పర్వత పంక్తులు ఎనిమిది. దీనిలో మేరు పర్వతమనేది నాభికేంద్రం. ఇందులోని మొత్తం వర్షాలన్నిటికి ఇలావృత వర్షం మధ్య భాగాన ఉన్నది. ఈ ఇలావృతానికి దక్షిణాన హిమాలయ - హేమకూట - నిషధ పర్వతాల వరసలున్నాయి. ఈ సరిహద్దులలోనే హరివర్ష, కింపురుషవర్ష, భారతవర్షాలున్నాయి. జంబూద్వీపంలోని ఇతర వర్షాలు ఇవీ - కేతుమాల, భద్రాశ్వ, రమ్యక, కురు, నీల, నిషధములు. (వీటిని వర్ణించడం అంటే - ప్రత్యేకంగా 'జంబూద్వీపం' అనే గ్రంధమే అవుతుంది). ఈ జంబూద్వీపంలోనిదే మన దేశం. భరతవర్షం. జంబూద్వీపం అనే పేరు రావడానికి కారణం - ఈ ద్వీపంలో గల మేరు పర్వతం / మందరగిరి మీద గల నేరేడు చెట్టు నుంచి ఏనుగు తలల్లాంటి జంబూ ఫలాలు రాలిపడి పగిలి, వాటి ఫలరసం నదిగా ప్రవహించింది. ఈ ప్రాంతంలో మట్టి జంబూ ఫలరసంలో నాని, దేవతల హస్తవాసితో బంగారం అవుతోంది. ఈ జంబూ నది ఒడ్డున వెలసిన దేవత - జంబ్వాదిని.
శ్రీమన్నారాయణుని పాదోద్భవ గంగ, సకల పాపహారిణిగా మేరుపర్వత శిఖరంపై కాలూనింది. ధ్రువుడనే గొప్ప విష్ణుభక్తుడు నేటికీ మేరుగిరిని శాశ్వత నివాసస్థానం చేసుకొని వెలగొందుతున్నాడు.
జంబూద్వీపంలోని దేశాలన్నిటా కర్మక్షేత్రం భరత భూమి ఒక్కటే! మిగిలినవన్నీ భోగ భూములు. స్వర్గలోక వాసులు తమ పుణ్యంలో మిగిలిన ఫలాన్ని అక్కడ అనుభవిస్తారు. ఇక్కడ కాలం ఎప్పుడూ త్రేతాయుగంతో సమానమైన రీతిలో నడుస్తుంటుంది. ఇంకొక సంవత్సరంలో అయువు తీరుతుందనగా ఇక్కడ స్త్రీలు (జంబూ ద్వీపంలోని భారత వర్షం మినహా మిగిలిన దేశాలు) గర్భంధరిస్తారు. ఈ దేశాల్లో నిరంతరం దేవీ స్తోత్ర, జప తపాలు సాగుతూంటాయి. ముఖ్యంగా ఈ జంబూద్వీపంలోని - ఇళావృత దేశంలో - భవుడొక్కడే దేవుడు. బ్రహ్మదేవుని అక్షి నుంచి ఉద్భవించాడు ఇతడు. కనుక ఇక్కడ భవుడు, తాను ఆత్మ - సంకర్షణుడిని (వాసుదేవునికి పర్యాయపదం) సదా ధ్యానిస్తూ ఉంటాడు.
 
అయ్యా, ఇది దేవీ భాగవతమునందలి అష్టమ స్కంధము నందలి, పదునొకండవ అధ్యాయమున భువన వ్యవస్థ నందు ఈ *భరతభూమి వైశిష్ట్యం* గురించి చక్కగా వర్ణించబడి వున్నది. ఈ అష్టమ స్కంధము పూర్తిగా భువనకోశ వ్యవస్థ  గురించి చక్కగా వివరింపబడి  వున్నది.
ఇదే విషయమును  శ్రీ విష్ణు పురాణమున కూడా చెప్పబడి వున్నది. పరికించగలరు.


శ్లో|| కల్పాయుషాం స్థాన జయాత్పునర్భవాత్‌ |
    
క్షణాయుషాం భారత భూజయో వరమ్‌ ||
     
క్షణేన మర్త్యేన కృతం మనస్వినః |
     
సం న్యస్య సం యాత్య భయం పదం హరేః ||

వందల - వేల ఎల్ల తరబడి ఆయుష్షున్న చోట పుట్టి ఏం లాభం? ఓ క్షణకాలం ఆయుష్షుతోనైనా సరే భరతభూమిపై జన్మించడం గొప్పవరం. శ్రీహరి స్వయంగా ప్రసన్నుడై
తన పట్ల భక్తిని - స్పృహనీ కల్గించే ఈ చోట ఆయన అభయ ప్రదానం అందరికీ   అందుతూంటుంది మరి!

శ్రీమన్నారాయణ కథాగానం జరగని చోటు - సాధు సత్పురుషులెవరూ వసించని చోటు - యజ్ఞ యాగాదులు జరగని ప్రదేశం ఇంద్రలోకమే కావచ్చు! దానికి తుల్యమైనదే కావచ్చు!..అది నివశించదగినది కాదు. ఒకసారి ఈ నేల మీద జన్మించిన వారు, తిరిగి చెట్టుగానో -  పూల తీగగానో ఇక్కడే జన్మించాలని కోరుకుంటారంటే భరతభూమి వైశిష్ట్యాన్ని ఇంకా   వివరించాలా? ఈ నేలతో ఏర్పడే అనుబంధం అట్లాంటిది.
ప్రాప్తా నృజాతిం త్విహ యే చ జంతవో జ్ఞాన క్రియా ద్రవ్య కలాప సంభృతామ్,
న వై య తే రన్న పునర్భవాయతే భూయోవనౌకా ఇవ యాంతిబంధనమ్.

ఇంతటి మహిమగల భారత దేశమునందు మానవులుగా జన్మించి జ్ఞాన, క్రియా, ద్రవ్య, సంపదలు గలిగియున్ననూ, ఎవరు పునర్జన్మ లేకుండుటకు యత్నింపరో, ఎవరు ఆ పరాత్పరున్ని పూజించరో, ఎవరు నిష్కామముగా శ్రీహరిని సేవించరో, వారు మరల జంతువుల వలె బంధింపబడుదురు.

భూదేవి ఆ యజ్ఞ వరాహమూర్తిని ఇలా ప్రార్ధించినది.
ఓం నమో భగవతే మంత్ర తత్వ లింగాయ యజ్ఞక్రతవే,
మహాధ్వరావయవాయ మహావరాహాయ నమః
కర్మ శుక్షాయ  త్రియుగాయ నమస్తే.

మీ
కామరాజుగడ్డ రామచంద్రరావు

No comments:

Post a Comment

Note: only a member of this blog may post a comment.