Friday, 29 June 2012

శివ కేశవుల అభేదము


శ్రీగురుభ్యోనమః శ్రీమాత్రేనమః
మహా పురాణములన్నియు శివుని గాని, విష్ణువుని గాని పరమ దైవతముగా ప్రతిపాదించు చున్నవి.
శ్రీదేవీ భాగవతము శ్రీశక్తి తత్త్వమును పరమార్ధ తత్త్వముగా ప్రతిపాదించుచున్నది. ఈ శక్తి తత్త్వము
పరమాత్మ తత్త్వములో అవిభాజ్యమగు ఇచ్ఛా శక్తి రూపమైనది. కావున శివ కేశవుల భేద భావనకు నే మాత్రము
నాస్పదము గాని పరమాత్మ తత్త్వమే  శ్రీ దేవీ భాగవతములో కూడా ప్రతిపాదించబడినది.

పురాణములు గుణ భేదము ననుసరించి సాత్త్విక, రాజస , తామస భేదమున విభజింపబడినట్లు సంప్రదాయజ్ఞులు చెప్పుచున్నారు. ఈ విషయమున గ్రహింపబడిన గుణ త్రయము పరమాత్మ సృష్టి స్థితి లయములను నిర్వహించుటకై మూర్తి త్రయమందు నిలిపిన ప్రవృత్తి, నివృత్త్యానంద రూపములగు గుణత్రయమే గాని సుఖ, రాగ, మోహ రూపములగు లౌకిక సత్త్వరజస్తమో గుణములు కావు. గుణ త్రయముల నుంచి వచ్చిన త్రిమూర్తులకు, దోషములను ఆపాదించి తక్కువ చేసి మాట్లాడటము సబబు కాదు. విధి నిర్వహణలో ఆయా గుణములతో, ఆయా రూపములతో ఆ పరమాత్ముడు చేసే విన్యాసములు. సృష్టి,  స్థితి యెంత ముఖ్యమో లయము కూడా అంతే  ముఖ్యము ఈ సృష్టిలో.

పురాణములకన్నిటికి కర్త అయిన శ్రీ వేదవ్యాస మహాముని చే  శ్రీదేవీ భాగవతము కూడా ప్రవచించబడినది... అన్నది గురు వాఖ్య, రుషి  వాఖ్య, లోక వాఖ్య. శ్రీదేవీ భాగవత మహా పురాణము పుణ్యకరమైనది,
ఉత్తమోత్తమమైనది. ఇందు పదునెనిమిది వేల శ్లోకములు గలవు. పండ్రెండు స్కంధములు, మూడువందల పదునెనిమిది యధ్యాయములు గలవు. దీనిని శ్రీ వ్యాస భగవానుడు ప్రవచించి ప్రకాశింపచేసెను. ఇది సర్గము, ప్రతిసర్గము, వంశము, మన్వంతరము, వంశానుచరితమునను నైదు  లక్షణములతో ఒప్పారుచున్నది.

శ్రీ  వేదవ్యాస మహాముని శ్రీ మహాభారతమును రచించెను. అది వేదసారము, పంచమ వేదముగా
కొనియాడబడినది. అష్టాదశ మహా పురాణములలో మహాభారతము లేదని, అందువలన దానిని శ్రీ వ్యాసుల వారు
విరచించలేదు....అని అంటే ఎట్లాగ? దేనినైనా మన పూర్వీకులు, పెద్దలు చెప్పిన మాటలను విశ్వసించాలి.
శ్రీ దేవి భాగవతము కూడా శ్రీ వేద వ్యాస మహర్షి చే రచించబడినది. అలా కాదు అనిన పక్షములో మిగతా అష్టాదశ పురాణముల యొక్క ఉనికి ప్రశ్నార్థకంగా మారవా? ఎందుకంటే వేటికీ ఇప్పుడు చూపించే ప్రమాణము లేదు గనుక. మన వేదములు పురాణముల పట్ల మన విశ్వాసమే ప్రమాణము. ఏ ప్రమాణములు లైతే శ్రీ వేదవ్యాసడు
అష్టాదశ మహా పురాణములకు కర్త అని ఘోషించినవో, అవే ప్రమాణములు శ్రీ దేవిభాగవతమును కూడా
శ్రీవేదవ్యాసడే రచించినాడు అని చెప్పినవి. ఇటువంటి సంకుచిత భావాలతో భగవంతున్ని చింతన చేయడము పాపము అవుతుంది. సర్వవ్యాపకుడైన భగవంతున్ని ఒక మూర్తికే పరిమితము చేయడము ఎంత వరకు సబబు?
అన్ని రూపాలూ ఆయనివే.

రాముడు విష్ణువు అని ఆరాధించే భక్తులకు ఏ ఫలము దక్కుతుందో, రాముడు శక్తి అని నమ్మేవారికి కూడా అదే
ఫలము లభిస్తుంది. అనగా అన్ని రూపాలు, అన్ని నామాలు ఒక్కటేనన్న సత్యాన్ని మన గ్రంధాలు, పురాణాలు చెబుతున్నాయి. ఒక పురాణము ప్రమాణమని, మరో పురాణము ప్రమాణము కాదని వాదించడములో అర్ధము  లేదు. అన్ని పురాణములు పరబ్రహ్మం యొక్క మహిమలనే చెప్తున్నాయని గ్రహించిన వారికి, అన్ని గ్రంధములు
ప్రమాణంగానే  కనిపిస్తాయి. ఒకటి నమ్మినప్పుడు మరొక దానిని నమ్మక తప్పదు.

 సాత్విక పురాణములే మోక్ష హేతువలని అన్నప్పుడు మరి మిగతా పురాణములు శ్రీవ్యాసుల వారు ఎందుకు రచించినట్లు? అసంబద్ధముగా లేదా? శివుణ్ణి, దేవిని వారి ఉనికిని ప్రశ్నించడము అన్నది ... దక్ష యజ్ఞములోని ఉదంతము నాకు గుర్తుకు వస్తున్నది.

రాముడే పరదైవం అనే వాళ్ళు కొందఱు, కాదు కృష్ణుడే పరాత్పరుడనే వారు మరి కొందరు, శివుడే భగవంతుడనే వారు కొందరు.  కాదు కాదు శక్తియే వీరందరికీ జన్మనిచ్చింది కాబట్టి ఆమెయే పరదేవత అనే వాళ్లు కొంత మంది లోకంలో వుంటారు. లోకములో భిన్నమైన రుచులు వుండడము సహజము గదా?
కానీ జ్ఞానులు మాత్రమే ఈ నామరూపాలకు, గుణత్రయానికి అతీతంగా వుండే నిర్గుణ పరబ్రహ్మాన్ని తెలుసుకొంటారు. దీన్నిబట్టి మనకు తెలిసేదేమంటే ఎవరిమటుకు వాళ్లు తాము పట్టిన కుందేటికి మూడే కాళ్లన్న చందాన,  పరుల విశ్వాసాన్ని నిందించడమే పనిగా పెట్టుకుంటారు. వీలందర్నీ ఆడించేది కర్మమే”, దానికి లోబడనివాడు లోకంలోనే వుండడు. చివరకు భగవంతుడైనా సరే నామరూపాలు  ధరిస్తే ఆ కర్మకు వశులు కాక తప్పదు. ఈ సత్యాన్ని తెలిసిన వాడె జ్ఞాని, యోగి, తెలియని వాడు మరలా కర్మ చక్రము లోనికి వస్తున్నాడు. తెలియని వానికి ముమ్ముక్షత్వం ఎలా లబిస్తుంది?

కర్మ చాలా బలమైనది అని ఎవడు గుర్తిస్తాడో, తెలుసుకొంటాడో వానికి అహంకారం తొలిగిపోతుంది. అహంకారం తొలిగిన వాడికి అన్ని రూపాలలోనూ పరమాత్మ కనిపిస్తాడు. సమదర్శనం అలవాటౌతుంది. వాడికే నిర్మల జ్ఞానం కలుగుతుంది. నిర్మల జ్ఞానం నుండి నిజమైన వైరాగ్యం పట్టుబడుతుంది. అటువంటి యోగికి ఒక రూపం నందు ప్రియము, మరొక రూపమునందు అప్రియము కలుగదు. అన్ని శాస్త్రములయందు, అన్ని రూపములయందు సమ దర్శనము పాటిస్తూ, ఆ నిరంజనుడ్ని, ఆ పర బ్ర్మహాన్ని దర్శిస్తాడు. ఒక దాన్ని ఎక్కువ మరొక దాన్ని తక్కువ చేసి మాట్లాడటము విబుధుల  లక్షణముగాదు గదా.

కొందరు ఈ విషయాలన్నీ తెలిసి కూడా , ప్రారబ్ధకర్మ చేత వశులై  అహంకారానికి, అజ్ఞానానికి లోబడి పోతూవుంటారు. దైవం ఒక్కడేనని, సృష్టి కార్యం కోసము, వివిధ నామ రూపాలను ధరిస్తాడని, వాటిలో ఏ నామ రూపాలతో ధ్యానించినా ఆ పరమాత్మ కరుణిస్తాడని తెలుసుకోవాలి. శైవులు నిరతయవుడైన లింగాకారాన్ని పరమాత్మగా ప్రార్ధిస్తారు. వైష్ణవులు నవ రత్న ఖచితమైన ఆభరణాలతో అలంకరించిన విష్ణువును పరమాత్మగా ఆరాధిస్తారు. ఎవరికి ఏ రూపం ఏ నామం ప్రియంగా వుంటుందో అతడా నామరూపాలతో ఆ పర బ్రహ్మాన్ని పిలుచుకోవచ్చు, కోలుచుకోవచ్చు. అన్ని రూపాలలో వుండేది ఆ ఒక్క పరబ్రహ్మామే అని, అందరూ ఒకటే అని తెలుసుకోన్నవాడే యోగి, జ్ఞాని . అందరిలో వున్న పరబ్రహ్మాన్ని తెలుసుకోవడమే  జ్ఞానము. ఒకటి ఎక్కువ చేసి, మరొక దానిని తక్కువ చేసి మాట్లాడటము సజ్జనుల  లక్షణముగాదు అని నా అభిమతము.

ప్రతి ద్వాపరయుగము నందు పురాణ సంహితలు వెలయించిన వ్యాసమహర్షులు వేరు వేరు. ప్రతి మన్వంతరము నందు వచ్చు ద్వాపరయుగమునందు ఒక్కో వ్యాస రూపంలో శ్రీకృష్ణ భగవానుడు ఒక్కో పురాణమును ప్రవచించెను. 28 ద్వాపరయుగమునందు,  శ్రీకృష్ణ ద్వైపాయణుడగు వ్యాసుడు వ్యాస పీఠమును అలంకరించిరి.ఓ మునులారా సత్యవతీ తనయుడు అగు వ్యాస మహర్షి వలన నేను సకల పురాణములను వింటిని.
శ్రీకృష్ణ ద్వైపాయణుడగు వ్యాసుడు శ్రీ దేవీ భాగవత పురాణము ప్రవచించగా నేను వింటిని, వానిని మీకు చెప్పుదును .... అని సూతుడు తన శిష్యులకు చెప్పెను. ఇది ఋషి ప్రోక్తం. దీనిని మనము నమ్మి తీరవలయును.

భాగవతకారుడు మూర్ఖునిలా దుఃఖిస్తాడా ?  అని అన్నారు. రామాయణములో శ్రీ రాముడు సీతమ్మ కోసం దుఃఖించ లేదా? దశరధుడు దుఃఖించ లేదా? పుట్టిన ప్రతి వాడూ దుఃఖిస్తాడు. దానిలో తప్పు లేదనుకొ౦టాను.
కుమారుని కోసము తండ్రి  దుఃఖించడము లో తప్పు ఏమిటి? మరి అదే మాయ. మాయ ఎంతటి వాడ్ని అయినా లొంగదీసుకొంటుంది.

మమ సమస్తాంగాయుధావరణ నిత్యామ్నాయ పరివారదేవతా సహిత శ్రీ మహాకామేశ్వరాంక నిలయ
శ్రీ మహాకామేశ్వర్యా౦బా మహా శ్రీ చక్రనగర సామ్రాజ్ఞి  సాక్ష్యముగా నాకు శ్రీ మహావిష్ణువు మరియ శ్రీ మహా శివుని యందు యెటువంటి భేద భావము లేదు. ఎవ్వరినీ నొప్పించాలనీ లేదు. ఎవరి విశ్వాసములు వారివి. అందరికీ నమస్కారములు. ఎవరినైనా నొప్పించి వుంటే  క్షంతవ్యుడను.

ఇట్లు
మీ
భాస్కరానందనాథ
(కామరాజుగడ్డ రామచంద్రరావు)
 1-2-2012

No comments:

Post a Comment

Note: only a member of this blog may post a comment.