Sunday, 10 June 2012

శ్రీచక్రము –దేవతలు-3


శ్రీచక్రము దేవతలు

ఒకటిగా వున్నప్పుడు నిర్గుణ పర బ్రహ్మము, బిందు స్వరూపము. అర్ధ నారీశ్వర  స్వరూపమై,  ప్రకృతి అయిన శక్తితో కలసి  మహాకారణ బిందువుగా, ఆ పర బ్రహ్మము తనలో తాను రమిస్తూ, చలనము లేకుండా  వుంటాడు. సృష్టి సమయము ఆసన్నమైనప్పుడు, పరబ్రహ్మ మహిషి అయిన శక్తి స్పందనచే రెండు రూపాలుగా విడివడి సగుణాకార రూపములో ప్రకృతీ, పురుషులుగా,  కామకామేశ్వరులుగా సృష్టి కార్యాన్ని ప్రారంభిస్తారు. అందుకే వారిని వేదము ఆది దంపతులుగా స్తుతించినది.
ఈ విధముగా ఒక బిందువు మూడు బిందువులుగా, మూడు నుండి  అష్ట బిందువులుగా విభాజితమై, సృష్టి పైనుంచి క్రిందికి అవరోహణ క్రమములో దిగివస్తున్నది.
దీనిని శ్రీచక్రములో మీరు గమనించగలరు.
బిందువు, ఆ తరువాత మూడు కోణములు త్రిభుజాకారములో గలవు.
త్రికోణా౦తర మధ్యస్థా అని లలితా సహస్రనామము లో ఆ తల్లిని కొనియాడినారు.
వాటి క్రింద అష్ట  కోణములు, వాటి క్రింద దశ కోణ ద్వయము , చతుర్దశ కోణము, అష్ట దళము, షోడశ దళము, మేఖలా త్రయము, భూపుర త్రయము -
ఈ విధముగా సృష్టి క్రమము మొదలైనది.
ఒక్కో కోణములో ఒక్కో దేవత కొలువై వుంటుంది.

శ్రీవిద్యాం శివవామభాగనిలయాం హ్రీoకారమన్త్రోజ్జ్వలాం
శ్రీచక్రాఙ్కిత బిన్దుమధ్యవసతిం శ్రీమత్సభానాయకీమ్|
శ్రీమత్షణ్ముఖవిష్ణురాజజననీం శ్రీమజ్జగన్మోహినీం
మీనాక్షీం ప్రణతోఽస్మి సంతతమహం కారుణ్యవారాన్నిధిమ్||
శ్రీ విద్యాస్వరూపిణి, శివుని ఎడమభాగమునందు నివసించునది, హ్రీంకార మంత్రముతో ఉజ్జ్వలమైన్నది, శ్రీచక్రములోని బిందువు మధ్య నివసించునది, ఈశ్వర్యవంతమైన సభకు అధిదేవతయైనది, కుమారస్వామి- వినాయకులకు కన్నతల్లియైనది, జగన్మోహినియైనది, దయాసముద్రమైనది అగు మీనాక్షీదేవిని నేను ఎల్లప్పుడు నమస్కరించుచున్నాను.


బిందు త్రికోణ వసుకోణ దశారయుగ్మ,
మన్వశ్రదళ సంయుత షోడశారమ్,
వృత్తత్రి  భూపురయుతం పరితశ్చతుర్ద్వాః,
శ్రీచక్రమేత దుదితం పరాదేవతాయాః.

చతుర్భి శ్శివచక్రైశ్చ, శక్తి చక్రైశ్చ పంచభిః,
నవ చక్రైశ్చ సంసిద్ధం శ్రీచక్రం శివయోర్వపుః.

కామేశ్వరీం పరామీడే కాది హాది స్వరూపిణీ౦,
మాతృకావర్ణ లిప్తాన్గీం మహా శ్రీచక్ర మధ్యగామ్.

శ్రీ శంకరభగవత్పాదులు శ్రీవిద్యా తంత్రము మరియు శ్రీచక్రమును గురించి సౌందర్యలహరిలో చాలా చక్కగా వివరించి యున్నారు. ఇప్పటికీ శ్రీ శంకరాచార్యులు స్థాపించిన అన్ని పీఠముల లోనూ శ్రీవిద్యాతంత్రానుసారం శ్రీచక్రార్చన, శ్రీవిద్య,  పరంపరగా అవిచ్చన్నముగా కొనసాగుతూనే వున్నది.
అప్పటి నుంచి ఇప్పటి వరకు ఎందరోమహానుభావులు, ఉపాసకులు శిష్య పరంపరగా, ఆచార్యులు నిర్దేశించిన మార్గములో పయనిస్తూ పునీతులౌతున్నారు.
వేద వాన్గ్మయముతో నిండి వున్న ఈ శ్రీవిద్యను పూర్వము శివుడు, విష్ణువు, బ్రహ్మ, మనువు, చంద్రుడు, కుబేరుడు, లోపాముద్ర, అగస్త్యుడు,
కుమారస్వామి, మన్మధుడు, ఇంద్రుడు, బలరాముడు, దత్తాత్రేయుడు, దూర్వాసుడు మొదలగు వారు ఉపాసించి ఆ పరదేవత యొక్క అనుగ్రహానికి పాత్రులైనారు.

పంచదశీ మహా మంత్రమునకు ఋషి దక్షిణామూర్తి. ఈ లోకమునకు తెచ్చినవాడు  మన్మధుడు.
పంచదశీ మహామంత్రాధికారముగలవారే శ్రీచక్రార్చనకు అర్హులుగా నిర్ణయించ బడినది.

5 శక్తి చక్రములు,  4 శివ చక్రములతో మొత్తము నవ చక్రములతో పర దేవతా స్వరూపమైన శ్రీచక్రము ఏర్పడినది. ఈ అనంత సృష్టికి సూక్ష్మ రూపమైన రేఖా చిత్రము - శ్రీచక్రము.
సంహారక క్రమము లో ....
1. ప్రధమ ఆవరణము  త్రైలోక్య మోహన చక్రము.
భూపుర త్రయము. మూడు రేఖలు, నాలుగు ద్వారాలతో కూడినది.
అధి దేవత త్రిపురా దేవి, యోగినీ దేవత ప్రకటయోగిని.
ప్రధమ భూపురమునందు  - అణిమ, లఘిమ, గరిమ,మహిమ,ఈశిత్వ,వశిత్వ,ప్రాకామ్య,భుక్తి,ఇచ్ఛా,ప్రాప్తి,సర్వకామ అనబడే అణిమాది సిద్దులు కలవు.
ద్వితీయ  భూపురమునందు బ్రాహ్మి,మహేశ్వరీ, కౌమారి, వైష్ణవి,వారాహి, మాహేంద్రి, చాముండ, మహాలక్ష్మి, అనే అష్ట మాతృకా దేవతలు గలరు.
తృతీయ  భూపురమునందు సర్వసంక్షోభిని, సర్వ విద్రావిణి, సర్వాకర్షిని, సర్వవశంకరి, సర్వోన్మాధిని, సర్వమహాంకుశ, సర్వఖేచరీ, సర్వబీజ, సర్వయోని, సర్వ త్రిఖండ,
అనే దశ ముద్రా శక్తులు గలరు. 

2. ద్వితీయ ఆవరణము సర్వాశాపరిపూరక చక్రము:-
షోడశ దళములు(16). అధి దేవత త్రిపురేశి,  యోగినీ దేవత గుప్తయోగిని.
కామాకర్షిణి, బుద్ధ్యాకర్షిణి, అహంకారాకర్షిణి, శబ్దాకర్షిణి, స్పర్శాకర్షిణి, రూపాకర్షిణి, రసాకర్షిణి, గంధాకర్షిణి,
చిత్తాకర్షిణి, ధైర్యాకర్షిణి, స్మృత్యాకర్షిణి, నామాకర్షిణి, బీజాకర్షిణి, ఆత్మాకర్షిణి, అమృతాకర్షిణి, శరీరాకర్షిణి, మొదలగు ఆకర్షణా దేవతలు గలరు. 
3. తృతీయ ఆవరణము సర్వ సంక్షోభణ చక్రము:-
అష్ట దళములు(8). అధి దేవత త్రిపురసుందరి,  యోగినీ దేవత గుప్తతర యోగిని.
దేవతలు:- అనంగకుసుమ, అనంగమేఖల, అనంగమదన, అనంగమదనాతుర, అనంగరేఖ, అనంగవేగిని,
అనంగాంకుశ, అనంగమాలిని. అష్ట దేవతలు గలరు.
4. చతుర్ధ ఆవరణము సర్వసౌభాగ్యదాయక  చక్రము:-
చతుర్ధశారము – 14 కోణములు .  అధి దేవత త్రిపురవాసిని,  యోగినీ దేవత సంప్రదాయయోగిని.
దేవతలు:- సర్వసంక్షోభిని, సర్వవిద్రావిణి, సర్వాకర్షిణి, సర్వాహ్లాధిణి, సర్వసమ్మోహిని, సర్వ స్తంభిని,            
సర్వజృ౦భిణి, సర్వవశంకరి,సర్వరంజని,సర్వోన్మాదిని,సర్వార్థసాధిని, సర్వసంపత్తిపూరిణి,
సర్వమంత్ర మయి, సర్వద్వంద్వక్షయంకరి.
5. పంచమ ఆవరణము   సర్వార్థసాధకచక్రము:-
బహిర్దశారము – 10 కోణములు .  అధి దేవత త్రిపురాశ్రీ,  యోగినీ దేవత కులోత్తీర్ణయోగిని.
దేవతలు:- సర్వసిద్ధిప్రదాదేవి, సర్వసంపత్ప్రదాదేవి, సర్వప్రియంకరి, సర్వమంగళకారిణి,
సర్వకామప్రదాదేవి, సర్వదుఖఃవిమోచని, సర్వమృత్యుశమనీ, సర్వవిఘ్ననివారిణి, సర్వాంగసుందరి,
సర్వసౌభాగ్యదాయిని.
6. షష్టమ ఆవరణము   సర్వరక్షాకర చక్రము:-
అంతర్దశారము - 10 కోణములు .  అధి దేవత త్రిపురమాలినీ,  యోగినీ దేవత నిగర్భయోగిని.
దేవతలు:- సర్వజ్ఞాదేవి, సర్వశక్తిదేవి, సర్వైశ్వర్యప్రదాయని, సర్వ జ్ఞానమయి, సర్వవ్యాధివినాశిని,
సర్వాధారస్వరూపాదేవి, సర్వపాపహరాదేవి, సర్వానందమయిదేవి, సర్వరక్షాస్వరూపిణిదేవి,
సర్వేప్సితఫలప్రదాయనిదేవి.    
7. సప్తమ ఆవరణము   సర్వరోగహర  చక్రము:-
అష్ట కోణము – 8   కోణములు. అధి దేవత త్రిపురాసిద్దాంబ,  యోగినీ దేవత రహస్యయోగిని.
దేవతలు:- వశిని, కామేశ్వరి, మోదిని, విమల, అరుణ, జయని, సర్వేశ్వరి, కౌళిని అనే వాగ్దేవతలు.

8. అష్టమ ఆవరణము   సర్వసిద్ధిప్రద చక్రము:-
త్రికోణము – 3 కోణములు. అధి దేవత త్రిపురాంబ,  యోగినీ దేవత అతిరహస్యయోగిని.
దేవతలు:-   కామేశ్వరి, వజ్రేశ్వరి, భగమాలిని.
9. నవమ ఆవరణము   సర్వానందమయి  చక్రము:-
బిందువు.   అధి దేవత మహాత్రిపురసుందరి,  యోగినీ దేవత పరాపర రహస్యయోగిని.
మహామహేశ్వరి, మహామహారాజ్ఞీ, మహామహా శక్తి, మహామహా గుప్త, మహామహాజ్ఞప్తి,
మహామహా నంద, మహామహా స్కంద, మహామహా శయ, మహామహా శ్రీచక్రనగర సామ్రాజ్ఞి అయినటువంటి లలితా త్రిపుర సుందరీ నిలయం బిందువు.

నవ కోణములలో విరాజిల్లినటువంటి ఆయా దేవతలకు చేసే పూజను నవావర్ణ పూజ అని అందురు.
లఘువుగా శ్రీచక్రమును పూజించాలంటే శ్రీదేవీ ఖడ్గమాలతో, విస్తారముగా చేయాలంటే
మహా యాగానుక్రమణికతో, షట్పాత్ర ప్రయోగములతో, ముద్రలతో,  శ్రీవిద్యోపాసకులు ఆ చిత్కలను ఆరాధించేదరు. దీనినే బహిర్యాగము, బహిర్ముఖ యాగము అని అందురు.
శ్రీచక్రమును రుద్ర నమకములతో, శ్రీ సూక్తముతో అభిషేకించి,  దేవీ అష్టోత్తర,శత, సహస్ర నామాలతో మరియు శ్రీ సూక్తముతో, దేవీ ఖడ్గమాలతో పూజించెదరు.

అంతర్ముఖ సమారాధ్యా, బహిర్ముఖ సుదుర్లభా.
ఆ చిత్కలను హృదయములో ఆరాధించే పద్దతిని అంతర్యాగము, అంతర్ముఖ యాగము  అని అందురు.
ఉపాసకులు, యోగులు, ఆ తల్లిని  “అంతర్యాగముద్వారా  హృదయములో శ్రీచక్రార్చన  చేస్తారు.
“అంతర్యాగము   చాలా కఠినతరమైనది. మనసును కేంద్రీకరించవలెను. ఆ పరదేవతను మనసులో ఆరాధించవలెను. కొన్ని రోజులు, కొన్ని సంవత్సరములు, కొన్ని జన్మలు బాహ్యముగా  సాధన చేస్తే, మనసు అంతర్ముఖము అవుతుంది. అప్పడు అంతర్యాగము సిద్దిస్తుంది.

అమ్మలగన్న అమ్మ యొక్క అంతరంగమును,
అంతర్ముఖమున, అక్షర రూపములో, ఆరాదించేందుకు,
అమోఘమైన, అంతర్యాగమే .... లలితాసహస్రనామ స్తోత్రము.

దాని సాధన, అది ఎలాగో,  అంతర్యాగము - గురించి మరో టపాలో తెలుసుకొందాము...... సశేషం

నమస్కారములతో,
మీ
భాస్కరానందనాథ
మహావిద్యోపాసకులు, మహాపాదుకాంత శ్రీవిద్యాపూర్ణ దీక్షాపరులు
(కామరాజుగడ్డ రామచంద్రరావు)