Sunday 10 June 2012

సదాచారాలు ఏవేవి


సదాచారములు

దేవతలను, గోవులను, బ్రాహ్మణులను, సిద్ధులను, ఆచార్యులను పూజించాలి. చిరగని వస్త్రద్వయాన్ని, విష్ణుక్రాంతం మొదలగునవి ఓషదుల్ని, గారుడం మొదలగు రత్నాలను ధరించాలి. సంధ్యావందనం - అగ్నిహోత్రం ఆచరించడం సరేసరి.
అలంకరించబడిన వేషం గలవాడై, ఎల్లప్పుడూ ఇతరులకు ఆహ్లాదకరమైన రూపంతో కనిపించాలి. (ఈ వేషాలంకరణలో సమస్త మంగళ ద్రవ్యాలూ చేరతాయి). పర ధనాదులను అపహరించరాదు.
స్వల్పంగానైనా అప్రియం పలకరాదు. ప్రియమైనా అసత్యం కూడదు. ఇతరుల దోషములెన్నరాదు. పరస్త్రీని - విరోధాన్ని కోరుకోరాదు. దుష్టమైన వాహనాలు ఎక్కరాదు. జలం చేత ఆవరించబడిన ప్రదేశంలో నీడ వున్నా ఆశ్రయించకూడదు. శత్రువు, పాపి, ఉన్మాది, అందరితోనూ జగడాలాడేవాడు, కీటకంలాగా బాధించేవాడు, నీచుడు, అసత్యప్రలాపి, నిత్యచోరజారకార్యకలాపి, మూర్ఖుడు, పరస్త్రీ వాంఛగలవాడు, జారిణి, సంకరజాతి స్త్రీలతో సంభాషించ కూడదు.
దారిలో ఒంటరిగా పోరాదు. జలప్రవాహం వేగంగా వున్నప్పుడు మునక పనికిరాదు. చెట్టు చివరికంటా ఎక్కరాదు. దంతాలు కొరకడం, ముక్కునలపడం, గట్టిగా అపానవాయువు విడవడం, గోళ్లుకొరకడం, గడ్డి త్రుంచడం, మట్టిగట్టచిదుపడం....ఇవన్నీ నిషిద్ధాలు.
నగ్నంగా ఉన్న స్త్రీని, ఉదయాస్తమయాలలో సూర్యుని చూడరాదు. శవాన్ని ఏవగించుకోరాదు. రాత్రులలో రచ్చచెట్టుకు - దుష్టస్త్రీలకు దూరంగా ఉండాలి.
బ్రాహ్మణులు, పూజ్యులైనవారు, దేవతలు, దేవతావిగ్రహాలు వీటి నీడను సైతం దాటరాదు. ఒంటరిగా శూన్యారణ్యాలకు వెళ్లరాదు. జనశూన్యాలైన గృహాలలో నివశించకూడదు. కేశములు, ఎముకలు, ముండ్లు అపవిత్రములు, బూడిద, ఊక, స్నానంచే తడిసిన నేల..వీటికి దూరంగా ఉండాలి. అయోగ్యుల్ని ఆశ్రయించకూడదు. కుటిలుడైనవాడిని ఏదీ కోరకూడదు.
కృరమృగాలు - సర్పములు మొదలగు వాటిని చూస్తే దూరంగా జరగాలి. వాటికి చేరువుగా కొద్దికాలమైనా నిలబడరాదు. అతిగా మేల్కోవడం అతిగా నిద్రపోవడం, అతిగా వ్యాయామం చేయడం నిషిద్ధం. కోరలు కొమ్మలుగల జంతువులకు, మంచుకు, మిక్కిలి బాధించే గ్రీష్మానికి దూరంగా ఉండాలి. దిసమెలతోస్నానం చేయడం గాని, నిద్రించడంగాని, ఆచమనం చేయడం గాని పనికిరాదు. అట్లే జుట్టుముడివేయక ఆచమించకూడదు. దేవతార్చనాదులూ పనికిరావు.
బ్రాహ్మణుని కాళ్లుకడిగేటపుడు, దేవతార్చనలోను, హోమాలు చేసేటపుడు, ఆచమనం చేసేటపుడు ఏకవస్త్రం పనికిరాదు. అంగవస్త్రం (భుజం మీద ఇంకొక వస్త్రం) ధరించి తీరాలి.
మంచి శీలవంతులనే స్నేహం చేయడానికి ఎన్నుకోవాలి. దుర్నడతగలవారికి దూరం జరగాలి. అరక్షణకాలమే అయినా సాధుపుంగవుల సాంగత్య మహిమ నెన్నతరమా?
ఉత్తములతో గానీ - అథములతో గానీ విరోధమెన్నడూ పనికిరాదు సగరచక్రవర్తీ! హాని అల్పంగా ఉంటే సహించే నేర్పు కలిగిఉండాలి. ఓర్పుముఖ్యం. పెనుహాని అయినపుడు అలక్ష్యం పనికిరాదు. ప్రాజ్ఞుడు కయ్యానికి కాలుదువ్వరాదు. శుష్కకలహం పనికిరాదు. వివాహమైనా వివాదమైనా సమఉజ్జీలతోనే సాగాలి. వైరం చేత ధనాన్ని ఎన్నడూ ఆర్జించవద్దు. నిలబడి ఆచమనం చేయవద్దు.
ఒక కాలితో ఇంకోకాలు తొక్కరాదు. స్నానంచేసిన వస్త్రంతోగాని చేత్తోగాని అవయవాలను తుడుచుకోరాదు. కేశాలను దులుపుకోరాదు. పూజ్యులైన వారివైపు కాళ్లు చాచరాదు.
గురువుగారు ఎదుట ఉండగా ఆసనం అధిష్ఠించరాదు. తప్పని పరిస్థితిలో వినయంగా కూర్చోవాలి. దేవాలయంలో అపసవ్యప్రదక్షిణ పనికిరాదు. పూజ్యులకెదురుగా, సూర్యచంద్రాగ్నుల కెదురుగా ఉమ్మివేయుట తగదు.
శ్లేషం, మూత్రం, రక్తం, పురీషాలను ఎప్పుడూ దాటకూడదు. అగ్నిహోత్ర సమయంలో గాని,పూజాసమయంలోగాని, మహాజన మధ్యంలోగాని, హోమశాలలోగాని కఫం, శ్లేషం విడువరాదు. (చీదరాదని అర్థం!) స్త్రీలను అమ్మడం గాని, అవమానించడం గాని, ఈర్ష్యపడడం గాని, ధిక్కరించడం గాని నిషేదము. రత్నాదిపూజ్య వస్తువులకు నమస్కరించకుండా ఇంటినుంచి బయలుదేరరాదు. విద్వాంసుల సేవ, సకాలంలో హోమక్రియ సజ్జనలక్షణాలు దీనోద్ధరణ కూడ.
ఓ రాజా! దేవతలను, ఋషులను పూజించేవాడు - పితృదేవతలనుద్దేశించి తర్పణాలు - పిండప్రదానాలు చేసేవాడు - అతిథులను సత్కరించేవాడు ఉత్తమలోకాలకు వెళ్తారు. హితకరమైన పలుకులను ఆహ్లాదంగా చెప్పేవాడు, అక్షయమైనట్టి లోకాలను చేరతాడు.
బుద్ధిమంతులు, క్షమావంతులు, వినయశిలురు, ఆస్తికులు సర్వోత్తమ లోకాలను పొందగలరు. అశౌచాది వేళలలోను, సూర్యగ్రహణాదులలోను, మేఘగర్జన సమయంలోను, పూర్నిమనాడు వేదాధ్యయనం పనికిరాదు. కోపగ్రస్తుడ్ని శాంతపరచడం - భయపడ్డవాడిని ఓదార్చడం - ఎవరిమీదా ద్వేషం లేకుండా ఉండడం - అందరికీ బంధువుగా మెలగడం అనేవి సాధుకృత్యాలు. ఇటువంటి సాధువుకు స్వర్గసౌఖ్యం సైతం అల్పమైన ఫలితంగానే తోచగలదు.
ఇంకా సదాచారాలు (జాగ్రత్తల నిమిత్తం చెప్పబడినవి) కొన్ని ఉన్నాయి. వాటిని ఆచరించడం సత్పురుష లక్షణం అనిపించుకుంటుంది.
ఎండా వానల్లో గొడుగుధరించి, అడవుల్లో - రాత్రుల్లో దండము ధరించి, దేహరక్షణ నిమిత్తం పాదరక్షలు ధరించి సంచరించాలి. పైకి చూస్తూ, అడ్డముగా చూస్తూ, దూరాన్ని పరికిస్తూ నడకసాగించకూడదు. కనుచూపుమేర ఏవేవి స్పష్టంగా కనిపిస్తుంటాయో అవే చూసుకుంటూ నడవాలి.
నియత్రితమైన మనస్సుతో, దోషాలు కలిగించేవాటన్నిటినీ దూరం జరిపి సంచరించేవారికి ఎటువంటి హాని కలుగదు. సదాచారవంతునికి ముక్తి కరతలామలకమే అనవచ్చు! కామక్రోధలోభాది అరిషడ్వర్గాలకు లోను కాకుండా సదాచారులై సంచరించేవారివల్లనే ఈ భూమి ఇంతకాలం నిశ్చింతగా ఉంది. (లేకున్నచో అల్లకల్లోలం తథ్యమని భావం)
ఇతరులకు దుఃఖకారణమవుతుందనుకుంటే, అది సత్యవచనం అయినప్పటికీ చెప్పకూడదు. మౌనమే శ్రేయోదాయకం. సాధారణస్థితులలో సత్యమే పరమప్రమాణం. ప్రియమైనదే అయినప్పటికీ హితకరం కాదని తెలిస్తే అప్పుడు కూడా మౌనంగా ఊరకుండడం ఉత్తమం. ప్రాణులకేది హితకరమో దాన్ని త్రికరణశుద్ధిగా ఆచరించేవాడే బుద్ధిమంతుడు. 
(శ్రీ విష్ణు పురాణము నుంచి సేకరించబడినది)
మీ
భాస్కరానందనాథ
మహావిద్యోపాసకులు, మహాపాదుకాంత శ్రీవిద్యాపూర్ణ దీక్షాపరులు


No comments:

Post a Comment

Note: only a member of this blog may post a comment.